
RCB vs DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయానికి తగ్గట్టుగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో.. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారంటే ఆర్సీబీ బౌలింగ్ ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభం నుండే చుక్కెదురైంది. ఇన్నింగ్స్ రెండో బంతికే సాహిల్ పరాఖ్ (0)ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయగా, ఆ మరుసటి ఓవర్‌లోనే జోష్ హేజిల్‌వుడ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. కెఎల్ రాహుల్ (1), సమీర్ రిజ్వీ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (0), ట్రిస్టన్ స్టబ్స్ (5) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ కేవలం 7 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి అత్యంత దారుణమైన స్థితిలో నిలిచింది.
టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన సమయంలో అభిషేక్ పోరెల్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేసి జట్టు స్కోరును 70 దాటించాడు. అతనికి డేవిడ్ మిల్లర్ (19) కాసేపు సహకరించినప్పటికీ, రాసిక్ సలామ్ ఆ జోడీని విడదీశాడు. చివర్లో సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 16.3 ఓవర్లలోనే ముగిసింది. జోష్ హేజిల్‌వుడ్ 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు.