Reading Time: < 1 minute
Sugarcane Juice Health Risks Diabetes Obesity Summer Tips

Sugarcane Juice Side Effects: ఎండలు మండిపోతున్న వేళ చల్లని చెరకు రసం తాగితే ఆ మజాయే వేరు. దేహానికి తక్షణ శక్తిని, ఉత్తేజాన్ని ఇవ్వడంలో చెరకు రసం అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు చెరకు రసం విషయంలో కొన్ని కీలక సూచనలు చేశారు. ఎవరెవరు చెరకు రసానికి దూరంగా ఉండాలి, ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

షుగర్ వ్యాధితో బాధపడేవారు లేదా బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండేవారు చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచించారు. ఎందుకంటే చెరకు రసంలో సహజ సిద్ధమైన చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది. అందుకే డయాబెటిస్ రోగులు దీన్ని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు చెరకు రసాన్ని తక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోకి వెళ్లిన వెంటనే షుగర్ లెవల్స్ పెంచడంతో పాటు బరువు పెరగడానికి కారణమవుతుందన్నారు. ఒకవేళ తాగాలనిపిస్తే, షుగర్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి చిన్న గ్లాసు తాగవచ్చు.

తరచుగా అజీర్తి, కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరకు రసం తాగకపోవడమే ఉత్తమం. చెరకు రసం తీసుకుంటే కడుపులో గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇది జీర్ణ సంబంధిత ఇబ్బందులను మరింత క్లిష్టతరం చేస్తుందన్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రోజుకు అతిగా చెరకు రసం తాగకూడదన్నారు. పరగడుపున చెరకు రసం తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడవచ్చన్నారు. రోడ్డు పక్కన అమ్మే చోట చెరుకు రసం తయారీలో ఎంతవరకు శుభ్రత పాటిస్తున్నారో గమనించడం ముఖ్యం అని వైద్యులు సూచించారు.