
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అరుదైన, అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు. పవర్ ప్లే ముగిసే సమయానికే ఢిల్లీ జట్టు కోలుకోలేని దెబ్బతిని, ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన ప్రదర్శనను నమోదు చేసింది.
ఢిల్లీ ఖాతాలో రెండు ‘చెత్త’ రికార్డులు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ఆర్‌సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ కోటను కూల్చేశారు. పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు) ముగిసేసరికి ఢిల్లీ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు చెత్త రికార్డులను తన పేరిటి లిఖించుకుంది.
అత్యల్ప పవర్ ప్లే స్కోరు: ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో ఇదే అతి తక్కువ స్కోరు (13/6). ఇంతకుముందు 2009లో రాజస్థాన్ రాయల్స్ (14/2), 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (14/3) పేరిట ఉన్న రికార్డులను ఢిల్లీ అధిగమించింది.
పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు: పవర్ ప్లే ముగిసేలోపు 6 వికెట్లు కోల్పోయిన మొదటి జట్టుగా కూడా ఢిల్లీ నిలిచింది.
ఢిల్లీ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. సాహిల్ పరాఖ్ (0), కెఎల్ రాహుల్ (1), నితీష్ రాణా (1), సమీర్ రిజ్వీ (0), ట్రిస్టన్ స్టబ్స్ (5), అక్షర్ పటేల్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 43 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఆర్‌సీబీ బౌలర్ల విశ్వరూపం..
ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్ తన స్పెల్‌తో ఢిల్లీ వెన్నుముక విరిచాడు. భువనేశ్వర్ కుమార్ కూడా తన స్వింగ్‌తో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఢిల్లీ బ్యాటర్లు ఆర్‌సీబీ బౌలర్ల వేగానికి తలవంచక తప్పలేదు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఆర్‌సీబీకి ఈ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన పెద్ద ఊరటనిచ్చింది. మొత్తానికి.. ఢిల్లీ క్యాపిటల్స్ తన సొంత గడ్డపై అభిమానుల మధ్య అత్యంత పేలవమైన ఆటతీరును ప్రదర్శించి, ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.