Reading Time: < 1 minute
Salary Delay May 1 2026 Bank Holidays List India

Salary Delay: సాధారణంగా ఉద్యోగులు ప్రతి నెలా 1వ తేదీ రాగానే తమ జీతం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి మే 1వ తేదీన జీతాలు అందడం కష్టమని తెలుస్తోంది. మే నెల స్టార్టింగ్‌లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి ఉండటమే జీతాల ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నిజానికి మే 1వ తేదీన ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (మే డే), ‘బుద్ధ పౌర్ణమి’ ఒకే రోజు వచ్చాయి. ఈ రెండు సందర్భాల వల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు పని చేయకపోవడం వల్ల జీతాల ప్రాసెసింగ్, నిధుల బదిలీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడనుంది.

జీతం ఎప్పుడు రావచ్చు..
మే 1న జీతం రావాల్సిన వారికి మరుసటి రోజు అంటే మే 2వ తేదీన లేదా ఆ తర్వాత డబ్బు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బంది కలగకూడదని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏప్రిల్ నెలాఖరులోనే (ముందుగానే) జీతాలు విడుదల చేస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఇచ్చే కంపెనీల్లో మాత్రం 1 లేదా 2 రోజులు ఆలస్యం కావచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్ వంటివి 24 గంటలు పనిచేసినప్పటికీ, కంపెనీల బల్క్ శాలరీ ప్రాసెసింగ్ బ్యాంకుల పనిదినాలపైనే ఆధారపడి ఉంటుంది.

మే నెలలో 13 రోజులు సెలవులు..
మే నెలలో ఆదివారాలు, శనివారాలు, పండుగలతో కలిపి మొత్తం 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఉద్యోగులు ఎవరు కూడా మే 1న జీతం రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం బ్యాంకు సెలవుల వల్ల కలిగే తాత్కాలిక ఆలస్యం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈఎంఐ లాంటివి ఉన్నవాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.