
Cole Thomas Allen: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ప్రతిష్టాత్మకమైన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా అనేకమంది వీఐపీలు హాజరైన ఈ వేడుకలో తూటాల గర్జన వినిపించడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా అధికారులు గుర్తించారు. ఇంతకీ అతను ఎవరు, తన కథ ఏంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.
హిల్టన్ హోటల్‌లో అసలు ఏం జరిగింది..
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో విందు జరుగుతుండగా, అలెన్ షాట్‌గన్‌తో బాంకెట్ హాల్ సమీపంలో ఒక భద్రతా ఏజెంట్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఆ అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దాడి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన అలెన్‌ను యూఎస్ సీక్రెట్ సర్వీస్ చాకచక్యంగా పట్టుకుంది. నిందితుడి వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని, అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
నిందితుడి విస్తుపోయే నేపథ్యం..
విచారణలో కోల్ థామస్ అలెన్ నేపథ్యం చూసి దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోతున్నారు. అతను నేర ప్రవృత్తి గల వ్యక్తిలా కాకుండా, అత్యున్నత విద్యావంతుడిగా రికార్డుల్లో ఉన్నారు. ప్రతిష్టాత్మక కాల్‌టెక్ (Caltech) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2014లో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో పాల్గొన్నారు. ఇతను వృత్తి పరంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, గేమ్ డెవలపర్‌గా గుర్తింపు పొందారు. మాలిక్యులర్ కెమిస్ట్రీ ఆధారంగా వీడియో గేమ్‌లను కూడా రూపొందించారు. సీ2 ఎడ్యుకేషన్ అనే సంస్థలో ట్యూటర్‌గా పనిచేస్తూ 2024లో ‘టీచర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యారు. హైస్కూల్ విద్యార్థులకు కాలేజీ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ కూడా ఇచ్చేవారు.
అలెన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రకారం.. అతను క్రిస్టియన్ స్టూడెంట్ ఫెలోషిప్‌లో చురుగ్గా ఉండేవారు. అలాగే 2024లో కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చే పొలిటికల్ యాక్షన్ కమిటీకి చిన్న మొత్తంలో విరాళం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అసలు ఇంతటి విద్యావంతుడు, సమాజంలో గౌరవం ఉన్న వృత్తిలో ఉన్న వ్యక్తి.. అధ్యక్షుడు హాజరైన వేడుకలో కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు? అనే కోణంలో ప్రస్తుతం సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.