
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. దాంతో ఐపీఎల్ 2026లో ఐదవ ఓటమిని చవిచూడగా.. ఇప్పటివరకు విజయం రుచే చూడలేదు. వరుస ఓటములపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుస ఓటములు చవిచూసినా.. జట్టు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. ఓటమి వెంటనే వచ్చి మ్యాచ్ గురించి మాట్లాడటం సులభం కాదని, అయితే జట్టులోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని రహానే తెలిపాడు. వరుస ఓటములు ఎదురైనా తాము బలంగా తిరిగి వస్తాం అని ధీమా వ్యక్తం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ… ‘ఓడిపోయిన వెంటనే వచ్చి మ్యాచ్ గురించి మాట్లాడటం అంత సులభం కాదు. అయినా నేను సానుకూల విషయాల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ప్రారంభంలోనే రెండు మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత మేం కోలుకున్నాం. కామెరూన్ గ్రీన్ ఇన్నింగ్స్ అద్భుతం. అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయినా ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేసిన తీరు చాలా గొప్పగా అనిపించింది. 147/4 నుంచి 180 పరుగులు ఆలౌట్ అవ్వడం సరికాదు. మేం తక్కువ పరుగులు చేశాం. అయినప్పటికీ మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. వారు చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. అందరూ తమ పాత్రను బాగా నిర్వర్తించారు’ అని చెప్పాడు
‘శుభ్‌మన్ గిల్ (86; 50 బంతుల్లో) చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బంతి కొంచెం బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో పడుతూ నెమ్మదిగా వచ్చింది. ముందుకు వేసిన హాఫ్ వాలీలు బ్యాట్‌కు వచ్చాయి. కొంత డ్యూ ప్రభావం కూడా ఉంది. అయినప్పటికీ ఇవి సాకులు కావు. 180 పరుగుల లక్ష్యాన్ని కాపాడాలంటే పవర్‌ప్లేలో వికెట్లు తీయాలి. గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ చక్కగా ఆడారు. నేను మరోసారి మా బౌలర్ల సానుకూలత గురించే చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పుడు బౌలింగ్ చేయడం సులభం కాదు. మేము మూడు క్లోజ్ మ్యాచ్‌లు ఆడాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు’ అని జింక్స్ చెప్పాడు.
కామెరూన్ గ్రీన్ ఫామ్‌లో ఉండటం చాలా మంచి విషయం. ఈరోజు గ్రీన్ బౌలింగ్ చేయలేదు. అతడు క్రాంప్స్‌తో బాధపడుతున్నాడు. అందుకే ఫీల్డ్‌లో కూడా మధ్య మధ్యలో బయటకు వెళ్ళాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతాం. కానీ ఆ క్షణంలో ఉండి ఆటను ఆస్వాదించడం ముఖ్యం. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించకుండా.. జట్టుగా మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. జట్టుగా మైదానంలోకి వెళ్లి మన ఆట ఆడాలి. ఈరోజు కూడా అదే ప్రయత్నం చేశాం. మొదటి బంతి నుంచే దూకుడుగా, సానుకూలంగా ఆడాలన్నదే మా లక్ష్యం. మేం బలంగా తిరిగి వస్తాం’ అని రహానే ధీమా వ్యక్తం చేశాడు.