Reading Time: 1 minute
Easy Book Cover Trick For Kids Notebooks Without Scissors Or Tape

Book Cover Trick: సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివే విద్యార్థులకు పరీక్షలు ముగిసి.. తర్వాత అకాడమిక్‌ ఇయర్‌ సిలబస్‌ కూడా స్టార్ట్ అయ్యింది.. మరోవైపు స్టేట్‌ సిలబస్ చదివే విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయి.. ఏప్రిల్ నెల సగం గడిచిపోయింది.. పిల్లలు కొత్త తరగతులకు అలవాటు పడిపోయారు. కానీ, చాలా మంది తల్లిదండ్రులకు మాత్రం ఇంకా ఒక చిన్న పని మిగిలే ఉంటుంది. అదే పిల్లల కొత్త నోట్‌బుక్‌లు, పుస్తకాలకు అట్టలు వేయడం. ఈ పని చిన్నదే అయినా, సమయం పట్టే పని కావడంతో చాలామంది వాయిదా వేస్తుంటారు.

సాధారణంగా పుస్తకాలకు అట్టలు వేయాలంటే బ్రౌన్ పేపర్, ప్లాస్టిక్ కవర్, కత్తెర, టేప్, జిగురు వంటి వస్తువులు అవసరం అవుతాయి. కొలతలు సరిగ్గా తీసుకోవాలి, కత్తిరించాలి, అంచులు మడవాలి. అయితే చాలా సార్లు పేపర్ వంకరగా కత్తిరించడం, టేప్ సరిగా అంటకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు ఒక సులభమైన చిట్కా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పద్ధతిలో కత్తెర, టేప్, జిగురు ఏవీ అవసరం ఉండవు. కేవలం కొన్ని నిమిషాల్లోనే పుస్తకానికి అట్ట వేయొచ్చు.

ఈ ట్రిక్ ఎలా పని చేస్తుంది?
పుస్తకాలు లేదా నోట్‌బుక్‌లను బైండ్ చేసే సమయంలో పేజీల అంచుల వద్ద చిన్న ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఉపయోగించి కవర్ పేపర్‌ను సులభంగా అమర్చవచ్చు. దీంతో అదనంగా కత్తిరించడం లేదా టేప్ వాడాల్సిన అవసరం ఉండదు.

అట్ట వేయడం ఎలా?
ముందుగా కవర్ పేపర్‌ను పుస్తకంపై సరిపడేలా ఉంచాలి. తర్వాత పేపర్ అంచులను లోపలికి మడవాలి. ఇప్పుడు పుస్తకం బైండ్ చేసిన దగ్గర ఉన్న చిన్న సందులో ఆ అంచులను నెమ్మదిగా చొప్పించాలి. ఇదే విధంగా మరో వైపున కూడా చేయాలి. అంతే.. కేవలం కొన్ని నిమిషాల్లోనే పుస్తకానికి అట్ట సరిగ్గా అమర్చబడుతుంది. టేప్ లేకుండా, కత్తెర లేకుండా, ఎలాంటి శ్రమ లేకుండా పని పూర్తవుతుంది.

తల్లిదండ్రులకు ఉపశమనం
ఈ చిట్కా చూసిన చాలా మంది తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత సులభమైన పద్ధతి ముందే ఎందుకు తెలియలేదని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పుస్తకాలకు అట్టలు వేయాల్సిన వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. పిల్లల పుస్తకాలను neatగా, త్వరగా సిద్ధం చేయాలనుకునే ప్రతి తల్లిదండ్రి ఈ సులభమైన ట్రిక్‌ను ఒకసారి ప్రయత్నించవచ్చు.