
విశాఖపట్నం: విశాఖ శివారు ప్రాంతమైన జోడుగుళ్లపాలెంకు చెందిన 27 ఏళ్ల ఎ. శాంతి కుమారి అనే యువతి బుధవారం విశాలాక్షి నగర్‌లోని ఒక లాడ్జ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఆమె తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఒక పార్టీ కోసం లాడ్జికి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. ఆ పార్టీ జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగిందని.. ఫ్రెండ్స్లోని ఇద్దరు ఆమెపై దాడి చేశారని విచారణలో వెల్లడైంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక లాడ్జిలో ఖాళీగా ఉన్న మరో గదిలోకి వెళ్లి శాంతి డోర్ లాక్ చేసుకుందని.. ఆమె ఫ్రెండ్స్ ఎంత తలుపు కొట్టినా తీయలేదని తెలిసింది.
ఆమె మూర్ఛ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె ఫ్రెండ్స్ తలుపు పగలగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ, శాంతి కుమారిని ఆమె స్నేహితులే కొట్టి చంపారని ఆమె తల్లి ఆరోపించారు. అరిలోవా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా లేక ఆమె ఫ్రెండ్స్ కొట్టిన దెబ్బల కారణంగా విశాలాక్షి చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శాంతిని బి స్క్వేర్ హోటల్‌లో కొట్టి హత్య చేశారని.. పార్టీ అని పిలిచి ఆమె ఫ్రెండ్స్ యువతి ప్రాణాలు తీశారని ప్రచారం జరుగుతోంది. హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని కొట్టి చంపారని.. ఫిట్స్ వచ్చాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం జరుగుతోందని యువతి బంధువులు ఆరోపించారు. నిందితుల్లో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు.