Reading Time: 2 minutes

బెంగాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపు ఓటు హక్కు ప్రమాదంలో పడుతోందా ?

Caption of Image.

ఎన్యూమరేషన్ ఫారం సరైన సమయంలో అందక  సరియైన ధ్రువపత్రాలు  సమర్పించడానికి సమయం సరిపోకపోవడం, 2003 ఓటరు లిస్టులో పూర్వీకుల పేరు మ్యాచ్  కాకపోవడం  తదితర కారణాలతో  వీరంతా ఓట్లను కోల్పోయారు.  వీరందరూ బూత్ లెవెల్​లో ఎన్నికల  అధికారి  ముందు  హియరింగ్​కి  హాజరై  ఎన్యూమరేషన్  ఫారంతోపాటు సరియైన ధ్రువపత్రాలు సమర్పించారు. 6 ఏప్రిల్  2026న ఎన్నికల కమిషన్ తుది జాబితాను ప్రకటించింది.

ఈ తుది జాబితాలో మొత్తం ఏకంగా 91 లక్షల మంది  తమ ఓట్లను  కోల్పోయారు.  ఈ  భారీ సంఖ్య దేశంలోని ప్రజాస్వామికవాదులకు ఆందోళన కలిగిస్తున్నది.  ఈ 91 లక్షల ఓట్లలో 27 లక్షల ఓటర్లను తార్కిక వ్యత్యాసాల కింద చేర్చారు.  భారీగా ఓట్ల  తొలగింపుతో  బెంగాల్​లో  ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

భారీ ఓట్ల తొలగింపుపై అనుమానాలు 
ఎస్ఐఆర్  జరిగిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే,  పశ్చిమబెంగాల్లో తొలి జాబితా కంటే తుది జాబితా  ప్రకటన వచ్చేవరకు మరింత భారీగా ఓట్లు తొలగిపోయాయి.  ఇది బీజేపీ  పశ్చిమ బెంగాల్లో  ఎలాగైనా  గెలవాలని  ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంటుగా మారి పనిచేస్తోందని ఆ రాష్ట్ర  సీఎం  మమతా బెనర్జీ  తీవ్రమైన  విమర్శలు చేస్తున్నారు. ఓట్లు కోల్పోయిన 27 లక్షలలో మెజార్టీ ఓటర్లు ముస్లింలు ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.  పశ్చిమబెంగాల్ మొత్తం జనాభాలో ముస్లింలు 30 శాతం.  వీరంతా తృణమూల్  కాంగ్రెస్  ఓటు బ్యాంకు.  వీరి ఓట్లు  బీజేపీకి వచ్చే అవకాశం లేదు.  కాబట్టి వీరి ఓట్లను లక్ష్యంగా  చేసుకున్నారనే  విమర్శలు వస్తున్నాయి.

ప్రతి నలుగురు ముస్లింలలో ఒకరి ఓటు‌‌ పోయింది
2021లో  మమతా బెనర్జీ నందిగ్రామ్​ నుంచి 1,956 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు.  ఈ నియోజకవర్గం బంగ్లాదేశ్ బార్డర్లో కూడా లేదు. అయినా  అక్కడ  ఇంత  భారీగా  ముస్లింల  ఓట్లు తొలగించడంపై అనుమానాలకు అవకాశమిస్తోంది.   కోల్​కతాకు  దగ్గర్లో  ఉన్న మరో  నియోజకవర్గం భవానీపూర్​ను  పరిశీలిద్దాం. 2021లో  మమతా బెనర్జీ నందిగ్రామ్​లో ఓడిపోయిన తర్వాత భవానీపూర్ నుంచి పోటీచేసి గెలిచారు. 

ఈ‌‌  నియోజకవర్గంలో  ముస్లింల ఓట్లు దాదాపు 30 శాతం  ఉన్నాయి.  తుది జాబితా ప్రకటించిన తర్వాత తొలగిపోయిన ఓట్లలో 51.8% ముస్లింల ఓట్లే.  అంటే ప్రతి నలుగురు ముస్లింలలో ఒకరి ఓటు‌‌ పోయింది.  అదే తొలగిపోయిన ముస్లిమేతరుల ఓట్లను పరిశీలిస్తే ప్రతి 17 మందిలో ఒకరి ఓటు తొలగింది.  గెలుపు ఓటములను  ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ముస్లింల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని రాజకీయ విమర్శలు భారీస్థాయిలో వినబడుతున్నాయి.

ప్రముఖుల ఓట్లు కూడా గల్లంతు
బసీర్​హాట్ నార్త్  నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 5లో  మొత్తం 340 మంది  ముస్లింల  ఓట్లను,  షంషేర్​గంజ్  నియోజకవర్గంలోని  బూత్ నెంబర్ 206లో  మొత్తం 420 మంది ముస్లింల ఓట్లు  తొలగించారు.  బీజేపీ గెలవడానికే  ఇలాంటి  కుయుక్తులను  పన్నుతోందని విశ్లేషకులు  అంటున్నారు.  2021లో  గెలిచిన  తృణమూల్  కాంగ్రెస్ పార్టీకి,  ప్రతిపక్ష బీజేపీకి  మధ్య ఓట్ల  వ్యత్యాసం  55 లక్షలు.  గత  ఎన్నికల్లో ఒక శాతంలోపు  ఓట్ల తేడాతో 36  నియోజకవర్గాలలో  తృణమూల్  కాంగ్రెస్  గెలిచింది.  ఇప్పుడు  ఈ స్థానాలలో ఎస్ఐఆర్ వల్ల  భారీగా  ఓట్లు తొలగిపోయాయి.  దీనివల్ల  ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది ఊహించవచ్చు.

ఎస్ఐఆర్ వల్ల కేవలం ముస్లింల ఓట్లే కాదు, పేదలు ముఖ్యంగా మహిళలు,  ప్రముఖుల ఓట్లు కూడా  గల్లంతవుతున్నాయి.  10 జులై 2025 నుంచి సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్  ప్రక్రియపై విచారణ  మొదలైంది.  జనవరి 2026లో  విచారణలు ముగిసాయి. కానీ, నేటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ  రాజ్యాంగ  నిబంధనలకు లోబడి జరుగుతుందా  లేదా  అనేది  సుప్రీంకోర్టు తేల్చలేదు.  దీంతో కోట్లాదిమంది పౌరుల ఓటు హక్కు ప్రమాదంలో పడుతుంది.  ఇక పౌరుల ఓటు హక్కును ఎవరు కాపాడగలరు?  అందుకే తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీయేతర  పార్టీలు,  పౌర సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

సలీమ్ పాషా, తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ చైర్మన్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.