
- కవిత, విశారదన్మహారాజ్అరెస్ట్
- రైతు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి మారింది: కవిత
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు బుధవారం భారీ నిరసన చేపట్టారు. పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపూర్ గ్రామాల్లో భూములు కోల్పోతున్న చిన్న, సన్నకారు రైతుల నిరసనలకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారద్ మహారాజ్ వికారాబాద్ ఆర్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు పెనం మీద ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని విమర్శించారు. సుమారు 1200 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా గుంజుకోవడం తగదన్నారు. రైతు బిడ్డలకు ఉద్యోగాలిచ్చిన దాఖలాలు లేవని, కౌలు రైతులకు రైతుబంధు హామీ ఏమైందని నిలదీశారు.
30 రోజులుగా రైతులు ధర్నా చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్ దీపక్ తివారీ సమస్యను పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా హామీ ఇచ్చినా.. న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదని కవిత స్పష్టం చేశారు.ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కవిత, విశారదన్మహారాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
మహిళా రైతులు పోలీసు వాహనాలకు అడ్డం పడి అరెస్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు కవితను, విశారద్ మహారాజ్‌ను అరెస్టు చేసి బంట్వారం పోలీస్ స్టేషన్‌కు, మిగతా వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి తర్వాత వదిలిపెట్టారు. ఇదే సందర్భంలో విశారద్ మహారాజ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.