
- మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత
- డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు చేస్తున్నామనే ముసుగులో ఓబీసీల హిస్సా(వాటా)ను చోరీ చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. డీలిమిటేషన్ ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే, కేంద్రీకరించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వం వక్రమార్గంలో ముందుకు సాగుతున్నట్టు విమర్శించారు. ఈ చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించడం లేదన్నారు.
కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నది మహిళా రిజర్వేషన్‌కు సంబంధం లేని అంశమని.. వారిది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నమని ఆరోపించారు. డీమిలిటేషన్, గెరీమాండరింగ్ ద్వారా అధికారాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసుకునేందుకు.. దేశ, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ సూచించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టానికి కాంగ్రెస్మద్దతు ఇచ్చిందని, అది ఇప్పటికే భారత రాజ్యాంగంలో భాగమైందని తెలిపారు.
- కులగణన డేటాతోనే ముందుకెళ్లాలి
కుల గణన డేటాను పక్కనబెట్టి 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓబీసీ జనాభా శాతానికి అనుగుణంగా ప్రాతినిధ్యం ఇవ్వకుండా వారి వాటాలో కోత పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజన కేవలం నంబర్ల ఆధారంగా చేయకూడదని, రాజకీయంగా సమానత్వం ఉండాలని డిమాండ్ చేశారు. కేంద్ర మొండి వైఖరిని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు దీన్ని అడ్డుకుంటాయన్నారు. జనగణన, కులగణన లెక్కలు పూర్తయ్యే వరకు వేచి ఉండి, ఆ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఏకమైన ప్రతిపక్షాలు
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో లోక్‌సభ సీట్లను 543 నుంచి 850 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నారు. అయితే ఈ మార్పుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, ఓబీసీలు, దళితులు, ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధానాలను అనుమతించబోమని స్పష్టం చేశాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి.