Reading Time: < 1 minute

ఐఎఫ్ఎస్ల బదిలీలకు రంగం సిద్ధం?..సీఎంవోకు చేరిన ఫైల్!

Caption of Image.
  •  త్వరలో ఉత్తర్వులు వచ్చే చాన్స్​
  •     రాష్ట్రంలో 80 పోస్టులకు.. ఉన్నది 49 మందే అధికారులు 
  •     వీరిలో ఏడుగురికి డిప్యుటేషన్ పై ఇతర శాఖల్లో విధులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అటవీ శాఖలో భారీ స్థాయిలో ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) ఆఫీసర్ల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కొంతకాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సంబంధిత ఫైల్ ప్రస్తుతం సీఎంవోకు చేరినట్లు సమాచారం. సీఎం పరిశీలన తర్వాత బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన మొత్తం క్యాడర్ స్ట్రెంత్ (అధికారుల సంఖ్య) 80 కాగా.. ప్రస్తుతం కేవలం 49 మందే ఉన్నారు. ఇంకా 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల పలు కీలక విభాగాల్లో అధికారులపై పనిభారం పెరగడంతో పాటు చాలా మంది అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

సమర్థులకు కీలక బాధ్యతలు!

అందుబాటులో ఉన్న 49 మంది అధికారులందరూ అటవీ శాఖలోనే విధుల్లో లేరు. వీరిలో ఏడుగురు ఇతర ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అటవీ శాఖలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా జిల్లాల్లో డీఎఫ్ వో పోస్టులు, వైల్డ్ లైఫ్, అటవీ అభివృద్ధి సంస్థ వంటి విభాగాల్లో అధికారుల అవసరం ఎక్కువగా ఉంది. 

ప్రభుత్వం పరిపాలనలో వేగం పెంచే క్రమంలో పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. జిల్లాల వారీగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణలను అడ్డుకోవడం వంటి అంశాల్లో యాక్టివ్ గా ఉండే ఆఫీసర్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.