
యాదాద్రి, వెలుగు : మూగ, చెవిటి వాడైన ఓ వ్యక్తి తన రెండేండ్ల కూతురిని హత్య చేశాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హన్మాపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములుకు మూగ, చెవుడు. అతడికి హయత్‌నగర్‌కు చెందిన మూగ, చెవుడు కలిగిన నాగరాణితో మూడేండ్ల కింద వివాహమైంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొడవ జరిగినప్పుడల్లా నాగరాణి కూతురు నిత్యశ్రీని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయేది. పుట్టింట్లో ఉన్న నాగరాణిని శ్రీరాములు ఇటీవలే హన్మాపురం తీసుకొచ్చాడు.
బుధవారం కూతురు నిత్యశ్రీని తీసుకొని శ్రీరాములు బైక్‌పై బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తన అన్న రాజుకు వీడియో కాల్ చేసి నిత్యశ్రీ లేవడం లేదని చూపించాడు. దీంతో అక్కడికి చేరుకున్న రాజు చిన్నారిని భువనగిరిలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు చిన్నారి అప్పటికే చనిపోయిందని చెప్పారు. శ్రీరాములే.. చిన్నారి నోటిని మూయడంతో పాటు గొంతును అదిమి పట్టుకోవడంతో నిత్యశ్రీ చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారి తాత మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాగొచ్చి వేధిస్తుండని తమ్ముడి హత్య
మలక్‌పేట, వెలుగు : తాగొచ్చి వేధిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పరిధిలోని ఉస్మాన్‌పురలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాఫ్దర్ హుస్సేన్ (22) అనే యువకుడు మద్యానికి అలవాటు పడి నిత్యం తల్లిని, అన్న హాషిం హుస్సేన్‌ను వేధించేవాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున అజంపురా ముస్లిం మెటర్నటీ హాస్పిటల్ వెనుక భాగంలో షాఫ్దర్, హాషిం మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన హాషిం కత్తితో షాఫ్దర్ గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.