Reading Time: < 1 minute
Gujarat High Court Notices Meta Google X Deepfake Regulation Sahyog Portal

కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించే నకిలీ వీడియోలు, ఫోటోలు (డీప్‌ఫేక్స్) సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిని అరికట్టడానికి బలమైన చట్టాలు కావాలని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి దిగ్గజ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

అక్రమ కంటెంట్‌ను వెంటనే తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘సహయోగ్’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో అన్ని టెక్ సంస్థలు చేరాలని, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మే 8వ తేదీలోగా దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది. గూగుల్, మెటా వంటి సంస్థలు కొంతవరకు సహకరిస్తున్నప్పటికీ, ‘ఎక్స్’ (X) సంస్థ మాత్రం సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో 94 సార్లు ఫిర్యాదులు చేసినా.. కేవలం 13 సార్లు మాత్రమే వారు సమాధానం ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది.

Also Read:Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

అభ్యంతరకర వీడియోలను తొలగించమని నోటీసులు ఇచ్చినా.. కొన్ని సంస్థలు ఆలస్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వివరించాయి. దీనివల్ల నేరస్తులను పట్టుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఆపడం కష్టమవుతోందని తెలిపాయి. ప్రస్తుతమున్న ఐటీ చట్టాలు ఈ కొత్త రకం ‘డీప్‌ఫేక్’ టెక్నాలజీని ఎదుర్కోవడానికి సరిపోవని వికాస్ నాయర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక శాంతికి ఇవి ముప్పుగా మారకముందే కఠినమైన నియమాలు తీసుకురావాలని ఆయన కోరారు.

సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా కొత్త నిబంధనలు ఉండాలని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. ప్రభుత్వం, ఈ టెక్ సంస్థల మధ్య సమన్వయం ఉంటేనే ఇలాంటి నకిలీ ముప్పులను అరికట్టడం సాధ్యమవుతుంది.