Reading Time: < 1 minute
Ap Government Issues Key Orders On Amaravati Spelling In Official Records

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక పత్రాలు, నోట్లు, లేఖాచారాల్లో రాజధాని పేరు Amaravati అనే సరైన స్పెల్లింగ్‌తోనే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల అమరావతి పేరును ఇంగ్లీష్‌లో ‘Amaravathi’గా రాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై చివరలో ‘Thi’కి బదులుగా ‘Ti’ ఉండేలా ‘Amaravati’ అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు పంపింది. జిల్లాస్థాయి కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, వివిధ విభాగాల మధ్య జరిగే అధికారిక కరస్పాండెన్స్‌లో ఒకే విధమైన స్పెల్లింగ్ పాటించాలని సూచించింది. రాజధాని నగరానికి సంబంధించి అన్ని అధికారిక రికార్డులు, డాక్యుమెంట్లు, ఫైళ్లు, లెటర్ హెడ్‌లు, ప్రకటనలు, వెబ్‌సైట్లు తదితర వాటిలో Amaravati పేరునే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రాజధాని అమరావతి పేరు విషయంలో ఉన్న గందరగోళానికి తెరపడనుంది. అన్ని శాఖలు ఒకే స్పెల్లింగ్‌ను వినియోగించడం ద్వారా అధికారిక పత్రాల్లో ఏకరీతి కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.