Reading Time: < 1 minute
Actor Rajasekhar Comments On Daughters Shivani Shivathmika Marriage

టాలీవుడ్ ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. తాజాగా శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ (Biker) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో రాజశేఖర్ మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు, తన కుమార్తెలు శివాని, శివాత్మికల వివాహంపై వస్తున్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు.

Also Read :Agadha: ఆకట్టుకుంటున్న ‘అగధ’ పోస్టర్..

రాజశేఖర్ కుమార్తెలు ఇద్దరూ ఇప్పటికే హీరోయిన్లుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వారి పెళ్లి గురించి వస్తున్న ప్రశ్నలకు రాజశేఖర్ స్పందిస్తూ.. ‘మా అమ్మాయిలకు మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆ దిశగా అన్వేషణ కూడా జరుగుతోంది. అయితే, వారు మాత్రం ప్రస్తుతం పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు’ అని తెలిపారు. శివాని, శివాత్మికలు మరికొంత కాలం సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నారని, వారి అభిరుచికి, నిర్ణయాలకు తండ్రిగా తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలను పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు.

ఇక రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, గతంలో తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతోనే ప్రజా సేవ చేశామని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన భార్య జీవితకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెబుతూనే, తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.