Reading Time: < 1 minute
Samrat Choudhary Becomes Bihar Chief Minister Bjp First Government Nitish Resigns

Bihar CM Samrat Choudhary: బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీహార్ బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి బుధవారం బీహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రశ్రేణి బీజేపీ నాయకులు, మిత్రపక్షాల భాగస్వాముల సమక్షంలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌదరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ మొట్టమొదటి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గత రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ శకానికి తెరపడింది. హిందీ హృదయభూమి అయిన బీహార్‌లో బీజేపీ అడుగు పెట్టింది.

READ MORE: Munaf Patel: విరాట్, రోహిత్‌కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..

ఇక, బీహార్ రాజకీయాల్లో కీలకమైన ‘కోయిరి’ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో నేతగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించారు. గతంలో 1968లో సతీష్ ప్రసాద్ సింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. అలాగే, కర్పూరీ ఠాకూర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి.. రెండు పదవులను చేపట్టిన అతికొద్ది మంది నాయకులలో ఒకరిగా నిలిచారు. 1999లో రబ్రీ దేవి క్యాబినెట్‌లో అతి చిన్న వయసులోనే మంత్రిగా చేరిన చౌదరి, అప్పట్లో వయస్సు వివాదం కారణంగా పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2000లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆర్‌జేడీ చీఫ్ విప్‌గా పనిచేశారు. 2014లో జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, నితీష్ కుమార్ తిరిగి రావడంతో బయటకు వచ్చారు. 2017లో బీజేపీలో చేరిన తర్వాత చౌదరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆపై ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు తన తలపాగా తీయనని శపథం చేసిన ఆయన, ఇప్పుడు అదే నితీష్ స్థానంలో ముఖ్యమంత్రి కావడం విశేషం.