Reading Time: < 1 minute

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు

Caption of Image.

రాయ్‎పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శక్తి జిల్లా సింగితారి గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. పవర్ ప్లాంట్‎లోని బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్ పేలుడుతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కసారిగా కంపెనీ నుంచి బయటకు పరుగులు చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి సుమారు మరో 30-40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడుకు గల స్పష్టమైన కారణం ఏంటన్నది ఇప్పటి వరకు తెలియలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ భారీ బ్లాస్ట్ తో పవర్ ప్లాంట్ పరిసరాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

ఈ ఘటనపై శక్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శక్తి జిల్లాలోని సింఘీ తరాయ్ ప్రాంతంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాయిలర్ పేలుడు సంభవించి 10 మంది మరణించారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని.. క్షతగాత్రులను రాయ్‌గఢ్‌లోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలంలో సహయక చర్యలు  చేపట్టామని తెలిపారు. బాయిలర్ పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతానికైతే పేలుడుకు గల స్పష్టమైన కారణం తెలియలేదని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.