Reading Time: < 1 minute
Nitish Kumar Recommends Cabinet Dissolution Bihar Political Change New Cm

బీహార్‌లో నితీష్ కుమార్ శకం ముగిసింది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌ పరిపాలకుడిగా సాగిన ప్రయాణం నేటితో ముగిసింది. కేబినెట్‌ను రద్దు చేస్తూ నితీష్ కుమార్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదించగానే నితీష్ కుమార్ ప్రభుత్వం రద్దవుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.

నితీష్ భావోద్వేగం..
కేబినెట్‌ను ఉద్దేశిస్తూ నితీష్ కుమార్ చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను చేయగలిగినంత చేశాను. 2005 నుంచి ఇప్పటి వరకు జరిగిన పదవీ కాలాన్ని గుర్తుచేశారు. తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీహార్ కోసం ఏం చేయాలో అదంతా చేశాను.’’ అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి పనులు కొనసాగాలని సూచించారు. మాట్లాడినంత సేపు మాటలు, హావభావాలు భావోద్వేగంతో కనిపించాయి. మంత్రులు, అధికారులు కూడా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా, గౌరవంగా విన్నారు.

పెద్దల సభకు..

అనూహ్యంగా గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈనెల 10న రాజ్యసభ ఎంపీగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తి రానున్నారు.