Reading Time: < 1 minute
Saqib Hussain Shines On Ipl Debut With 4 Wickets Credits Varun Aaron For Success

ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మలు ఇప్పటికే మెరవగా.. తాజాగా బిహార్‌కు చెందిన యువ పేసర్ సకిబ్‌ హుస్సేన్‌ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమవారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున బరిలోకి దిగిన సకిబ్‌.. సంచలన బౌలింగ్‌ (4/24) ప్రదర్శనతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సకిబ్‌.. ఈ ప్రదర్శనతో తాను ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ప్రతి ప్లేయర్ ఇలాంటి డెబ్యూ గురించి కలలు కంటాడని చెప్పుకొచ్చాడు.

‘ప్రతి ఆటగాడూ ఇలాంటి అరంగేట్రంనే కోరుకుంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను ఆడబోతున్నానని మ్యాచ్‌కు ఒక రోజు ముందు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ చెప్పారు. అప్పటి నుంచి నా దృష్టి మొత్తం మంచి ప్రదర్శనచేయడంపై పెట్టా. మానసికంగా నేను పూర్తిగా సిద్ధం అయ్యాను. జట్టుకు నా వంతు సహాయం చేయాలనే సంకల్పంతో మైదానంలోకి దిగా. నా బౌలింగ్‌లో కనిపిస్తున్న మెరుగుదలకు కారణం కోచ్ వరుణ్ ఆరోన్‌. ఈ క్రెడిట్ ఆయనదే’ అని సకిబ్‌ హుస్సేన్‌ స్పష్టం చేశాడు.

Also Read: Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు!

‘గత నాలుగు మ్యాచ్‌లుగా కోచ్ వరుణ్ ఆరోన్‌తో కష్టపడి పని చేస్తున్నా. ఆయన దగ్గర నుంచి ప్రతి అంశం నేర్చుకున్నా. ఆయనకు నా కృతజ్ఞతలు. ఒక యువ ఆటగాడిగా ఆయన మార్గదర్శకం ఎంతో ఉపయోగపడింది. అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్లు తీయడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. నిజానికి ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. మొదటి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడం నా కెరీర్‌కు మంచి ఆరంభం. భవిష్యత్తులో కూడా ఇలానే రాణించాలని ఆశిస్తున్నా’ అని ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ సకిబ్‌ హుస్సేన్‌ చెప్పుకొచ్చాడు.