Reading Time: < 1 minute

అసోంలో గురువారం రాత్రి నుంచి జాడతెలియకుండా పోయిన భారతీయ వాయుసేన సుఖోయ్ విమానం కుప్పకూలింది. సుఖోయ్ 30 ఎంకెఐ ఫైటర్ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు గాలింపు తరువాత శుక్రవారం నిర్థారించారు. గురువారం రాత్రి ఈ ఫైటర్ విమానం అసోం లోని జోర్హాట్ నుంచి బయటుదేరినప్పుడు గల్లంతు అయింది. అసోంలోని కర్బి అగ్లాంగ్ జిల్లాలో ప్రమాదం జరిగింది, రాడార్ కేంద్రం నుంచి అదృశ్యం అయింది. ఈ ప్రమాద వివరాలను భారతీయ వైమానిక దళం ((ఐఎఎఫ్) తమ ప్రకటనలో తెలిపింది. మృతులను పైలట్లు పూర్వేశ్ దురాగ్‌కర్ (28) ఫ్లెయిట్ లెఫ్టినెంట్‌గా ఉన్నారు. మృతుల్లో మరో వ్యక్తిని స్కాడ్రన్ లీడర్ అనుజ్‌గా గుర్తించారు. మృతుల్లో లెఫ్టినెంట్ పూర్వేశ్ గత ఏడాది భారతీయ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో చురుగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. పది రోజుల క్రితం సెలవులపై కుటుంబంతో గడిపి ఇటీవలే విధులలో చేరాడు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పూర్వేష్ స్వస్థలం. తమ కొడుకు ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నన్ని రోజులూ ఎవరితోనూ మాట్లాడలేదని, కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ వచ్చాడని, ఎయిర్‌ఫోర్స్‌కు ఎనలేని సేవలు అందించిన పూర్వేష్ తమకు దేశానికి గర్వకారణం అని తండ్రి రవీంద్ర వార్తా సంస్థలకు తెలిపారు. సెలవుల తరువాత విధుల్లో చేరిన ఆయన బుధవారం చివరి సారి తమతో ఫోన్‌లో మాట్లాడాడని తరువాత ఇప్పుడు చనిపోయినట్లు వార్త తెలిసిందని ఆవేదన చెందాడు. జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన రెండు సీటర్ల ఫైటర్ తరువాత కొద్ది సేపటికే అదుపు తప్పి, జాడ తెలియకుండా పోయింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాల సంస్థ సుఖోయ్ విమానాలు భారతీయ వాయుసేన బలంగా 260కు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధ విమానాలను హిందూస్థాన్ ఎయిరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) వాయుసేన కోసం నిర్మిస్తోంది.