Reading Time: 2 minutes

కర్ణాటకలో ఇక 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా నెట్ వర్క్ ను చూడకుండా నిషేధం విధించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. పిల్లలలో మొబైల్ వినియోగం మరీ ఎక్కువయిపోయి, అదో దురవాటుగా మారకుండా, వారిపై చెడుప్రభావం పడకుండా చూసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నదని ఆయన అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ఈ అంశంపై యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లతో చర్చించారు.ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించిన మొదటి రాష్ట్రం కర్ణాటకనే కాగలదు. గతంలో ఆంధ్రప్రదేశ్, గోవా కూడా సోషల్ మీడియా పై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ నిర్ణయం తీసుకుంటున్న తొలిరాష్ట్రం కర్ణాటక కావడం విశేషం. ఈవిషయంపై కొద్ది కాలంగా కర్ణాటకలో విసృ్తత స్థాయిలోనే చర్చ నడుస్తోంది.యువతరంలో కృత్రిమ మేధస్సు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించేలా చూసే విషయంలో ప్రభుత్వం పలు చర్యలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, బయో టెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే సూచనప్రాయంగా తెలిపారు.

పిల్లలు ఎక్కువగా మొబైల్, కంప్యూటర్ లు చూడడం వల్ల స్క్రీన్ ఎక్స్ పోజర్ తీవ్రప్రభావం చూపుతోందని ఆరోగ్య శాఖమంత్రి దినేష్ గుండూరావు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పై అడ్డు ఆపూ లేకపోవడం వల్ల, కుటుంబ వాతావరణం కూడా దెబ్బతింటున్నదని బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి సురేష్ కుమార్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కూడా తెలిపారు.ఇప్పటికే పలు దేశాలు సోషల్ మీడియా ను కట్టడిచేసేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. ఆస్ట్రేలియా యువకులలో సోషల్ మీడియా వినియోగంపై గట్టి పరిమితులు విధించింది. బ్రిటన్, ఫిన్ లాండ్ కూడా ఈ మార్గంలోనే అడుగులు వేస్తున్నాయి. యూరప్ లో ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ క్లాస్ రూమ్ లో స్మార్ట్ ఫోన్ లవినియోగంపై పరిమితులు విధించాయి. భారతదేశ ఆర్థిక సర్వే 2025 -26 నివేదికలో ఇప్పటికే యువతలో అధికంగా స్మార్ట్ పోన్ వినియోగం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల నిద్రసమస్యలు, విద్యార్థులలో శ్రద్ధ తగ్గడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. టీనేజ్ యువత సోషల్ మీడియా వినియోగానికి అలవాటుపడి, ఆన్ లైన్ గేమ్ లు వంటి వ్యసనాలకు పోతున్నారని సైబర్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.