Reading Time: < 1 minute

అమరావతి: సూపర్ సిక్స్ పథకాన్ని.. సూపర్ హిట్ చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో మన పరపతి పెరిగిందని, కేంద్రం సహకరిస్తోందని అన్నారు. విజయనగరం జిల్లా ను పర్యటించారు. చీపురుపల్లిలో నిర్వహించిన సభలో సిఎం మాట్లాడారు. అధిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఎపి అని కొనియాడారు. వైసిపి పాలనలో అరాచకం రాజ్యమేలిందని, గత ప్రభుత్వం అందరినీ వేధించిందని విమర్శించారు. తనను జైల్లో పెట్టారని.. అయినా కుంగిపోలేదని తెలియజేశారు. రాష్ట్రాన్ని బాగుచేయమని చెప్పి.. తమకు అధికారం ఇచ్చారని, వెంటిలేటర్ పై ఉన్న ఎపి ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చేయూతనిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, 3 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, పోలవరం నుంచి విశాఖకు గోదావరి నీళ్లు.. గోదావరి నీళ్లను వంశధార ద్వారా తరలిస్తామని అన్నారు. సంపద సృష్టించి.. పేదలకు పంచుతామని, ప్రజల పాస్ పుస్తకాలపై గత పాలకుల ఫొటోలు వేసుకున్నారని, భూములను ఆధీనంలో పెట్టుకుని.. అడ్డగోలుగా వ్యవహరించారని మండిపడ్డారు. తాను అందరి వాడినని.. పేదలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.