Reading Time: 2 minutes
Ayesha Meera Case Cbi Hands Over Remains To Parents

బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో విషాదకర ఘట్టం ముగిసింది. సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులను చూసి అక్కడి వారు చలించిపోయారు.

ఆయేషా మీరా హత్య జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అసలు హంతకుడెవరో తేలకపోవడం గమనార్హం. గతంలో ఈ కేసులో సత్యం బాబును నిందితుడిగా భావించినప్పటికీ, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టినప్పటికీ, సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేస్తున్నట్లు (Closure Report) కోర్టుకు తెలిపింది. తమ బిడ్డకు న్యాయం జరగలేదని, కనీసం ఆమె అవశేషాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కోరడంతో కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది.

Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!

2019లో ఈ కేసు విచారణలో భాగంగా శాస్త్రీయ ఆధారాల కోసం ఆయేషా మీరా భౌతిక కాయానికి సిబిఐ రీ-పోస్టుమార్టం నిర్వహించింది. ఆ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆమె శరీర భాగాలు , అవశేషాలను సేకరించి భద్రపరిచారు. ఇప్పుడు కేసు విచారణ ముగియడంతో ఆ అవశేషాలను తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలకు అప్పగించారు. ఈ అవశేషాలను తమ సొంత ఊరు తెనాలికి తీసుకువెళ్లి అక్కడ ఇస్లాం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా మహిళా , మానవ హక్కుల సంఘాలు కోర్టు వద్ద ఆందోళన చేపట్టాయి. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, అసలు నిందితులపై ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 19 ఏళ్ల పోరాటం తర్వాత కూడా హంతకుడిని పట్టుకోలేకపోవడం వ్యవస్థల వైఫల్యమేనని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు.

డబ్బు, అధికారం ఉన్న వారిపై ఆయేషా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా చేసిన పోరాటం సామాన్యమైనది కాదని బాధితులకు మద్దతుగా నిలిచిన నేతలు కొనియాడారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనా, ఏ ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా తమ బిడ్డకు న్యాయం కోసం వారు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. చివరికి హంతకుడిని శిక్షించలేకపోయినా, తమ బిడ్డ అవశేషాలకైనా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!