Reading Time: < 1 minute

కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలన్న మహోన్నత లక్ష్యంతో కెసిఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా ఈ ప్రభుత్వం పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహబూబ్ నగర్‌లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కెటిఆర్ విమర్శించారు. పదేళ్లపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందన్నారు. ఇప్పటికే చెక్ డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరాశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ఆయన మండిపడ్డారు.