
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మాక్సి-స్కూటర్ ఈ85 ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీకి అనుకూలంగా రూపుదిద్దుకుంది. దేశంలోనే ఈ సాంకేతికతతో వస్తున్న తొలి స్కూటర్లలో ఇది ఒకటిగా నిలిచింది. కంపెనీ దీన్ని పూర్తిగా దేశీయంగానే తయారు చేయనుండటం విశేషం. విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దీనివల్ల ధర చాలా పోటీతత్వంతో ఉండే అవకాశం కనిపిస్తోంది.
అధునాతన ఫీచర్లు
అంతర్జాతీయంగా పేరుగాంచిన ఎక్స్-ఏడీవీ స్కూటర్ ఆధారంగా దీన్ని చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముందు భాగంలో ఎత్తుగా ఉండే అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, జంట ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు ఈ వాహనానికి ప్రత్యేక లుక్‌ను ఇస్తున్నాయి. సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ స్కూటర్‌లో టెఫ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్ ఉన్నాయి.
భద్రత విషయానికి వస్తే, సింగిల్-చానెల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఏకంగా 27 లీటర్ల భారీ అండర్‌సీట్ స్టోరేజ్ కెపాసిటీని అందించారు. టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. ముందు భాగంలో 14 అంగుళాలు, వెనుక 13 అంగుళాల వీల్ సెటప్‌తో ఇది వస్తోంది. దీని బరువు 133 కేజీలు ఉండగా, సీటు ఎత్తు 780 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీగా ఉంది. అలాగే 8.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కల్పించారు.
లాంచ్ వివరాలు
ఈ నయా మాక్సి-స్కూటర్‌లో 157సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 16.3 హార్స్‌పవర్ శక్తిని, 14.9 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన ఈ ఇంజిన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో నడుస్తుంది. రెడ్‌వింగ్, ప్రీమియం బిగ్‌వింగ్ షోరూమ్‌ల ద్వారా ఈ వాహనం విక్రయించనున్నారు.
ప్రస్తుతం ఈ మోడల్‌ను మాత్రమే అధికారికంగా ప్రదర్శించారు. త్వరలోనే లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. దేశీయంగా తయారై విదేశాలకు ఎగుమతి కానున్న ఈ సరికొత్త మాక్సి-స్కూటర్ రైడర్లకు అద్భుతమైన అనుభూతిని పంచనుంది.