Reading Time: < 1 minute
Kartik Aaryan Donates 1 Crore Actor Extends Support To Assam Flood Relief Efforts

Kartik Aaryan: అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం ఆయన అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 19 నుంచి అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. అనేక జిల్లాలు నీటమునిగిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందించేందుకు కార్తీక్ ఆర్యన్ చేసిన విరాళం ఎంతో ఉపయోగపడనుంది.

అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక X ఖాతాలో చేసిన పోస్టులో, సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించిన కార్తీక్ ఆర్యన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర సహాయక చర్యలకు ఆయన అందించిన ఈ సహకారం  ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించినట్లు పేర్కొంది. ఈ పోస్టును ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా తన ఖాతాలో రీషేర్ చేస్తూ కార్తీక్ ఆర్యన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అస్సాం ప్రజలకు అండగా నిలిచిన ఆయన ఉదారత నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రస్తుతం గోలాఘాట్, శివసాగర్, బిస్వనాథ్, చరాయిదేవ్, కామరూప్ మెట్రోపాలిటన్, జోర్హాట్, ధేమాజి, నాగావ్ జిల్లాలు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లు, 437 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావంతో 2,12,400 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో చరాయిదేవ్ జిల్లాలో దాదాపు 80 వేల మంది, శివసాగర్‌లో 71 వేల మంది, జోర్హాట్‌లో 40 వేల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తు సమయంలో కార్తీక్ ఆర్యన్ చేసిన ఈ భారీ విరాళం సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు అందుకుంటోంది. అభిమానులు ఆయన సామాజిక బాధ్యతను కొనియాడుతూ స్పందిస్తున్నారు.