Reading Time: < 1 minute

 రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) బ్యాంకును మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ముంబై పాలి హిల్ నివాస ఆస్తిని ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. ఆర్‌కామ్ బ్యాంకు మోసం కేసులో ఇప్పటివరకు గ్రూప్ కంపెనీల మొత్తం జప్తు ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ముంబైలోని ‘అబోడ్’ అనే ఆస్తిని జప్తు చేయగా, దీని విలువ రూ.473.17 కోట్లు ఉంటుంది.

సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వాటిలో రూ.40,185 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడి ప్రకారం, పాలి హిల్ ఆస్తిని రైజ్ ఈ ట్రస్ట్ అనే ఫ్యామిలీ ట్రస్టులో చేర్చి, అనిల్ అంబానీకి సంబంధం లేదని చూపించే ప్రయత్నం చేశారని తెలిపింది. పర్సనల్ గ్యారెంటీల బాధ్యతల నుంచి ఆస్తిని రక్షించడమే లక్ష్యమని ఈడి పేర్కొంది.