
తైపీ: ఇండియా యంగ్ షట్లర్ ఉన్నతి హుడా, తన్వీ శర్మ.. తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఉన్నతి 23–21, 21–16తో దేవికా సిహాగ్‌పై వరుస గేమ్‌ల్లో గెలిచింది. 42 నిమిషాల మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఉన్నతి 11–3తో తొలి గేమ్‌ను మొదలుపెట్టింది. కానీ బలమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయిన దేవిక 21–21తో స్కోరును సమం చేసి రేసులో నిలిచింది.
అయితే నెట్ వద్ద రెండు మెరుగైన డ్రాప్స్ వేసిన ఉన్నతి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన ఉన్నతి.. దేవికాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దాంతో స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది. మరో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–15, 18–21, 21–14తో సుపానిదా కటెతోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్ 12–21, 10–21తో నాలుగోసీడ్ యుడాయ్ ఒకిమోటో (జపాన్) చేతిలో ఓడాడు.