
- తెలంగాణ అంటేనే వ్యాపారం: సీఎం రేవంత్‌రెడ్డి
- మా వద్ద పాలసీ పెరాలసిస్ లేదు.. మౌలిక వసతుల కల్పనలో వెనక్కి తగ్గం
- గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలే.. మేం 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ కడుతున్నం
- స్కైరూట్‌లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ వర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్
- సీఐఐ నార్తర్న్ రీజినల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. చైనా, జపాన్, జర్మనీలాంటి పారిశ్రామిక దిగ్గజ దేశాలతో పోటీ పడేలా మ్యానుఫ్యాక్చరింగ్‌కు ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు. అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న స్కైరూట్‌లాంటి స్థానిక ఏరోస్పేస్ సంస్థలకు కూడా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అవసరమైన మానవ వనరులను అందిస్తామన్నారు .
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు నాయకత్వం వహించినా పారిశ్రామిక అనుకూల విధానాల విషయంలో ఎలాంటి తేడా ఉండబోదని చెప్పారు. రాష్ట్రంలో ‘పాలసీ పెరాలసిస్’ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని పేర్కొన్నారు. ఎంసీహెచ్‌ఆర్డీ ప్రాంగణంలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం అత్యంత సురక్షితమైన, కీలకమైన గమ్యస్థానమని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఎంత పెట్టుబడి పెడతారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? అనేది చెబితే చాలని, అనుమతుల నుంచి ప్రోత్సాహకాల వరకు ప్రతీది ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు పూర్తి స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ కల్పిస్తామని తెలిపారు. సీఎస్ నిత్యం పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను స్వయంగా ప్రతి మూడు నెలలకోసారి పారిశ్రామిక ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై.. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో తమకు ఎలాంటి పోటీ లేదని, టోక్యో, న్యూయార్క్‌లాంటి ప్రపంచ శ్రేణి నగరాలతోనే పోటీ పడుతున్నామని వివరించారు. ‘థింక్ గ్లోబల్… ఇన్వెస్ట్ గ్లోబల్’ నినాదంతో తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి ముందుకు రావాలని ఆహ్వానించారు.
ఎయిర్‌పోర్టులు, బుల్లెట్ ట్రైన్లు.. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు
పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా వెనుకాడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు సరుకుల రవాణా సులువుగా జరిగేలా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుల్లో మూడింటిని తెలంగాణ సాధించుకుందని, శంషాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరు నగరాలకు ఈ బుల్లెట్ రైళ్లు అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. కేంద్రం వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి సూత్రప్రాయ అనుమతులు ఇచ్చిందని చెప్పారు.
ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని ఏకంగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, కేవలం 700 ఎకరాల్లో ఉన్న గుజరాత్ గిఫ్ట్ సిటీ కంటే ఇది ఎంతో బృహత్తరమైనదని పోల్చి చెప్పారు. ఈ సిటీ కోసం సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అమెజాన్ రూ.లక్ష కోట్లతో, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. 140 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలాగే సీఐఐ కూడా 130 ఏండ్లుగా విజయవంతంగా కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా జాతీయ పురోగతిలో కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్‌లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ వేదికగానే ‘తెలంగాణ రైజింగ్-2047’ దృక్పథాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో (జీడీపీ) తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, 2047 నాటికి ఈ భాగస్వామ్యాన్ని ఏకంగా 10 శాతానికి పెంచడమే తన లక్ష్యమని చెప్పారు.
తెలంగాణ పారిశ్రామిక విధానాలు అద్భుతం: సీఐఐ రీజియన్ చైర్మన్ పునీత్ కౌరా
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని సీఐఐ నార్తర్న్ రీజియన్ చైర్మన్ పునీత్ కౌరా కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్లే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్ వైపు వరుస కడుతున్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల వాతావరణంతోపాటు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం ఉండడం వల్లే తమ అధ్యయన సమావేశానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సీఐఐ వైస్ చైర్మన్ శారదా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనితా దాట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్నా తదితర కార్పొరేట్ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. గ్లోబల్ ప్లేయర్ల చూపు తెలంగాణవైపే
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) స్థాపనకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని, దాదాపు 200 అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘హార్వర్డ్’, ‘స్టాన్‌ఫోర్డ్’లాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కూడా తెలంగాణలో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఉన్నత విద్య, సాంకేతిక పరిశోధనలకు కేటలిస్ట్‌గా మారేందుకు నల్సార్ , ఐఐటీ, ఐఎస్‌బీలాంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ఏఐ సునామీని తట్టుకునేలా యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేందుకు పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ నెలకొల్పినట్టు వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయానికి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు బోర్డు సభ్యులుగా ఉన్నారని వివరించారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగానే ఇక్కడ కోర్సులు రూపొందిస్తున్నామని తెలిపారు. దీనికితోడు రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు) మారుస్తున్నామని, ఇందులో 86 శాతం వ్యయాన్ని టాటా సంస్థ భరిస్తూ స్వయంగా నిర్వహణ చూసుకుంటోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు.