Reading Time: < 1 minute
Turkey Pakistan Defence Ties C 130 Flights Drones And Air Defence Systems

Pakistan: పాకిస్తాన్ ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు భారత్‌పై యుద్ధం చేయాలని భావిస్తుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లో కీలక వైమానిక స్థావరమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు టర్కీ సైనిక విమానాల రాకపోకలు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సీ-130 హెర్‌క్యులెస్ విమానాలు రావల్పిండిలోని నూర్ ఖాన్, కరాచీలోని మసూర్ వైమానిక స్థావరాలకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 19 నుంచి 21 వరకు టర్కీకి చెందిన C-130 విమానాలు పాకిస్తాన్‌కు వచ్చి వెళ్లాయి. దీనిని భారత నిఘా వర్గాలు అసాధారణ పరిణామంగా గుర్తించింది. ఈ విమానాల ద్వారా పాకిస్తాన్ డ్రోన్లు, డ్రోన్ సంబంధిత పరికరాలు, ఇతర సైనిక సామాగ్రి తరలించి ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే కాకుండా చైనా నుంచి కూడా భారీగా ఆయుధాల దిగుమతి జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ HQ సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పొందిందనే వాదన కూడా ఉంది. అయితే, ఈ ఆయుధాలు లేదా డ్రోన్ల సరఫరాపై పాకిస్తాన్ లేదా టర్కీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

అయితే, టర్కీ డ్రోన్లపై పాక్ ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ టర్కీ డ్రోన్లను భారత్‌పై వాడింది. వీటన్నింటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పటికే బైరక్టర్ టీబీ2 డ్రోన్లు పాక్ వద్ద ఉన్నాయి. గతంలో భారత్ తో సైనిక ఘర్షణ సమయంలో టర్కీ తన డ్రోన్ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్‌లో మోహరించింది. ప్రస్తుతం పాక్ తన మానవరహిత వైమానిక సామర్థ్యాలను (UAV) పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఎక్కువసేపు గాల్లో ఉండగల డ్రోన్లు, లాయిటరింగ్ మ్యునిషన్ వంటి వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది.