Reading Time: < 1 minute
Andhra Pradesh Heavy Rain Alert North Andhra Low Pressure Bay Of Bengal

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఈదురు గాలులతో ఎగసిపడనున్న అలలు.. మత్స్యకారులకు అలర్ట్

అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనికి తోడు సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీగా ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఏయే జిల్లాల్లో వర్ష సూచన?

సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించారు.

ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయట ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, భారీ హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటి కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.