
తీగ లాగితే డొంక కదిలినట్టు చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్ ప్రెస్లో మహిళ శరీర భాగాలను సూట్ కేసులో గుర్తించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి పాల్పడింది భార్యాభర్తలుగా పోలీసులు తేల్చారు. చెన్నైలో హయాత్ నిషా అనే మహిళను హత్య చేసి.. ఆమెను ముక్కలుగా చేసి రెడ్ కలర్ సూట్ కేసులో ప్యాక్ చేశారు. ఆ సూట్ కేసును తమిళనాడు ఎక్స్ ప్రెస్లో తరలించారు. ఆగ్రాలో ఈ సూట్ కేసును పోలీసులు గుర్తించారు.
భార్యాభర్త ఇద్దరూ కలిసి ఆ మహిళను హత్య చేసి.. ఆమె శరీర భాగాలతో బిర్యానీ వండి.. రైల్లో వదిలేసి పరారయ్యారు. నిందితుల ఇంట్లో ఉన్న బిర్యానీ పాత్రలో శరీర భాగాలు, రక్తపు మరకలు కనిపించడంతో చంపేసి బిర్యానీ వండారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నైలోని 350కి పైగా సీసీ కెమెరాలను విచారణలో భాగంగా పరిశీలించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఆ ఇంట్లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హత్యకు గురైన మహిళ ఇద్దరు మహిళల్లో ఒకరనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. ఆగస్ట్ 6న రైలు ఆగ్రా చేరుకున్నాక జనరల్ బోగీలో రెడ్ కలర్ సూట్ కేసు కనిపించింది. సూట్ కేసు నుంచి రక్తం బయటకు రావడంతో ప్రయాణికులు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా ముక్కలు చేసిన స్థితిలో తల లేని మృతదేహం కనిపించింది. మృతదేహ అవశేషాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి.. కేసు నమోదు చేశారు. ఆగ్రా రైల్వే పోలీసుల స్పెషల్ టీం చెన్నైకి చేరుకుని తమిళనాడు పోలీసులతో కలిసి ఈ కేసును దర్యాప్తు చేసింది.
హత్యకు పాల్పడిన ఇద్దరు గుడువంచేరిలోని మసీద్ వీధిలో ఉన్న ఒక అద్దె ఇంటి నుంచి సూట్ కేస్తో బయల్దేరినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి ప్రాంగణంలో, ఇంట్లో సోదాలు చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. భర్త నుంచి విడిపోయి తన సోదరి -భాగమతి ఫ్యామిలీతో ఉంటున్న హయాత్‌ను ఆమె సోదరి, సోదరి భర్తనే చంపినట్లు పోలీసులు తేల్చారు.