150 కోసం గొడవ.. 45 ఏళ్లుగా కోర్టుల చుట్టూ.. లక్షల ఖర్చు.. ఈ కథ మామూలుగా లేదుగా..

సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా ఒక చిన్న అప్పు వివాదం ఏకంగా 45 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కింది. కేవలం రూ.150 రూపాయల కోసం మొదలైన గొడవ, తరాలు మారినా తెగలేదు. వందలాది కోర్టు వాయిదాలు, లక్షల రూపాయల ఖర్చు తర్వాత ఎట్టకేలకు ఈ కేసులో తీర్పు వచ్చింది. కానీ తీర్పు వచ్చే సమయానికి నిందితుడి వయసు 75 ఏళ్లకు పైబడటం గమనార్హం. బిహార్‌లో జరిగిన ఈ విచిత్ర ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి బీజం పడింది అక్షరాలా 1981 మే 5న. బిహార్‌లోని గాయ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో లోఢన్ సహనీ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన భికారీ సహనీని తనకు ఇవ్వాల్సిన రూ.150 రూపాయల అప్పు తిరిగివ్వమని అడిగాడు. ఆ చిన్న మాట కాస్తా ఇరువర్గాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు లోఢన్ సహనీ ఇంటిపై దాడి చేశారు. లోఢన్ సహనీ చేతులు, కాళ్లు కట్టేసి కొట్టడమే కాకుండా వారి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ కాలంలో దాదాపు రూ.2,500 విలువైన ధాన్యం, బట్టలు, ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
1981 లో కేసు.. 2026 లో తీర్పు..
ఈ ఘటనపై 1981 జూన్ 14న పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1983 జనవరి 17న కోర్టు నిందితులపై ఆరోపణలను ఖరారు చేసింది. అప్పటి నుంచి మొదలైన వాయిదాల పర్వం ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు సాగింది. దేశంలో ఇంటర్నెట్, మొబైల్స్ లేని కాలంలో ప్రారంభమైన ఈ కేసు ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినా తెగలేదు.
లెక్కల తిప్పలు
కేవలం 2018 నుండి 2026 మధ్య కాలంలోనే దాదాపు 130 సార్లు కోర్టు వాయిదా పడింది. కేసు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 700 కంటే ఎక్కువ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది.
రూ.150 రూపాయల కోసం మొదలైన ఈ పోరాటంలో ఇరువర్గాలు కలిసి వకీళ్లు, ప్రయాణాలు, కోర్టు ఖర్చుల కోసం ఏకంగా రూ.5 నుండి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టడం విశేషం.
వృద్ధాప్యం చూసి వదిలేసిన కోర్టు
ఈ సుదీర్ఘ విచారణలో ప్రధాన నిందితుల్లో ఒకరైన కప్పల్ సహనీ కేసు నడుస్తుండగానే మరణించాడు. చివరకు కోర్టు జీవించి ఉన్న ఏకైక నిందితుడు భికారీ సహనీ (75)ని దోషిగా తేల్చింది. అయితే అతని వృద్ధాప్యం, పేదరికం, ఇప్పటికే 45 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ అనుభవించిన మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకున్న జిల్లా, అదనపు సెషన్స్ జడ్జి, అతనికి జైలు శిక్ష విధించకుండా కేవలం హెచ్చరికతో విడుదల చేశారు.
నేటి సమాజానికి ఇదో గుణపాఠం..
ఈ కేసు కేవలం రూ.150 రూపాయల వివాదం మాత్రమే కాదు. చిన్న చిన్న పట్టింపులు, అహంకారాలు మనుషుల జీవితాలను, సంపాదనను ఎలా నాశనం చేస్తాయనే దానికి ఇదొక సజీవ ఉదాహరణ. అంతేకాకుండా, మన న్యాయవ్యవస్థలో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యానికి, ముగింపు లేని వాయిదాల పర్వానికి ఈ కేసు ఒక నిదర్శనంగా నిలిచింది.