
అమెరికా 10-ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అనూహ్యంగా 5 శాతాన్ని తాకాయి. దీనికి ప్రధాన తక్షణ కారణం ఇరాన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 109.80 డాలర్లకు పెరగటమే. దీనివల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పెరిగిన అమెరికా ప్రభుత్వ అప్పులు, పెరుగుతున్న జాతీయ బకాయిలు, AI బూమ్ కోసం టెక్నాలజీ కంపెనీలు చేస్తున్న అప్పులు, అలాగే ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అంచనాలు ఈ దీర్ఘకాలిక వడ్డీ రాబడి పెరుగుదలకు అసలైన కారణాలుగా నిలిచాయి.
ప్రపంచ దేశాలపై బాండ్ ఈల్డ్స్ ప్రభావం:
అమెరికా బాండ్ వడ్డీ రేట్ల పెరుగుదల ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. అమెరికా బాండ్ల వడ్డీ రేట్లు పెరగడంతో గ్లోబల్ బాండ్ మార్కెట్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ఫలితంగా బ్రిటన్ 10-ఏళ్ల గిల్ట్ ఈల్డ్స్ ఏకంగా 5.44 శాతానికి పెరిగి 2007 నాటి గరిష్ట స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఈ మార్పును గమనిస్తూ.. గతంలో ఉన్న అతి తక్కువ వడ్డీ రేట్ల కాలం ముగిసిందని, ఇకపై వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉండే “నార్మల్ ఫర్ లాంగర్” దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని హెచ్చరిస్తున్నారు.
సాధారణ ప్రజలు వ్యాపారులపై ప్రభావం:
ఈ బాండ్ ఈల్డ్స్ పెంపు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో 30-ఏళ్ల హోమ్ లోన్ రేటు దాదాపు 6.76 శాతానికి చేరింది. దీనివల్ల ఇళ్లు, వ్యాపారాలకు అప్పులు చేయడం చాలా ఖరీదైపోయింది. మరోవైపు అమెరికా ప్రభుత్వ పబ్లిక్ డెట్ జీడీపీలో 100 శాతాన్ని దాటి 32 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం విపరీతంగా పెరుగుతోంది. ఇది ప్రభుత్వ ఖర్చులను కుదించడానికి, రాజకీయంగా ఒత్తిడికి గురిచేయడానికి దారితీస్తోంది.
స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం:
బాండ్ ఈల్డ్స్ 5 శాతానికి చేరడం స్టాక్ మార్కెట్లకు ఒక పెద్ద సవాలుగా మారింది. సురక్షితమైన ప్రభుత్వ బాండ్లు ఇస్తున్న అధిక రాబడుల కారణంగా ఇన్వెస్టర్లు స్టాక్స్ కంటే బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఈక్విటీ వాల్యుయేషన్లను కుదిపేస్తుంది. భవిష్యత్ కార్పొరేట్ లాభాల విలువను లెక్కించే డిస్కౌంట్ రేటును పెంచుతుంది. ఈ 5 శాతం స్థాయి మార్కెట్లలో ఒక విభజన రేఖలా పనిచేసి, స్టాక్ మార్కెట్లలో కొంత అశాంతిని, హెచ్చుతగ్గులను సృష్టిస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా స్టాక్ మార్కెట్లపై ప్రభావం:
అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు.. గ్లోబల్ ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, సేఫ్ అమెరికన్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. దీనివల్ల భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు(FIIs) తగ్గి, అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే రూపాయి విలువ బలహీనపడటం.. దిగుమతి చేసుకునే ఇంధన ఖర్చులు భారత్‌పై అదనపు భారాన్ని మోపుతాయి. ఈ వడ్డీ రేట్ల అశాంతి ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే మరి.