Reading Time: < 1 minute
Delhi Brics Summit Security Duty Police Constable Gun Reels Suspended

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలు దేశాధినేతలంతా హస్తినకు వచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భద్రతను సీరియస్‌గా కట్టుదిట్టం చేశారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. బాధ్యతలు మరిచి తుపాకీలతో రీల్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.

డీపక్ బంగర్ అనే కానిస్టేబుల్ నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని ఫారినర్స్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. BRICS సదస్సు సందర్భంగా విదేశీ ప్రతినిధులు బస చేసిన రెండు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఒకదాని పైకప్పుపై స్నైపర్ డ్యూటీకి నియమించారు. అయితే విధుల్లో ఉండగానే ఆయుధాలతో రీల్స్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఆయన వేర్వేరు దుస్తుల్లో తుపాకులతో కనిపించారు. ఓ రీల్‌లో డీపక్ బంగర్ నల్లటి క్యాజువల్ షర్ట్ ధరించి లైట్ మెషిన్ గన్ చేతిలో పట్టుకుని గురిపెడుతున్నట్లుగా పోజిచ్చారు. అనంతరం కెమెరా రాత్రి సమయంలో కనిపిస్తున్న నగర దృశ్యాల వైపు తిరిగింది. మరో వీడియోలో ఆయన జేబులో పిస్టల్ పెట్టుకుని కనిపించారు. అంతేకాకుండా మెడలో BRICS సదస్సు భద్రతా విధుల కోసం జారీ చేసిన గుర్తింపు కార్డును కూడా ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లాయి.

రీల్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో డీపక్ బంగర్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. BRICS సదస్సు వంటి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయుధాలతో సోషల్ మీడియా రీల్స్ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలో జరిగిన BRICS సదస్సు

18వ BRICS సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగింది. BRICS కూటమికి భారత్ నాలుగోసారి అధ్యక్షత వహించింది. ఇందులో BRICS సభ్య దేశాలకు చెందిన 11 ప్రతినిధి బృందాలు, 10 భాగస్వామ్య దేశాలు, నాలుగు ప్రాంతీయ సంస్థలు, ఏడు అంతర్జాతీయ సంస్థలు సహా మొత్తం 32 ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి.