Reading Time: 2 minutes
Job Astrology: రవి, శనుల ఎఫెక్ట్.. ఈ రాశుల వారి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం!

ఈ నెల(సెప్టెంబర్) 17న రవి కన్యారాశిలో ప్రవేశించి అక్కడే నెల రోజుల పాటు సంచారం చేయడం జరుగుతుంది. రవి కన్యా రాశి ప్రవేశం వల్ల మీనంలో ఉన్న శనితో సమసప్తక దృష్టి ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాలు తండ్రీ కుమారులే అయినప్పటికీ బద్ధ శత్రువులు కావడం వల్ల కొన్ని రాశుల వారికి కష్టనష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల సమసప్తక దృష్టి వల్ల ఉద్యోగంలో అధికారులతోనూ, వృత్తి, వ్యాపారాల్లో వినియోగదారులతోనూ, కుటుంబంతో తండ్రితోనూ వాదోపవాదాలు, వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, సింహం, తుల, మకరం, మీన రాశుల వారు నెల రోజుల పాటు ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

మేష రాశి

ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న శనికి, షష్ట స్థానంలో ఉన్నరవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల అధికారులతో తీవ్ర విభేదాలు తప్పకపోవచ్చు. గ్రహ బలం అనుకూలంగా లేనందువల్ల మౌనంగా సర్దుకుపోవడం మంచిది. ఉద్యోగం పోవడం లేదా ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావడం జరుగు తుంది. తండ్రి అనారోగ్యానికి గురికావడం గానీ, తండ్రితో విభేదించడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అప్రతిష్ఠపాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

మిథున రాశి

దశమ స్థానంలో ఉన్న శనికి, చతుర్థ స్థానంలోఉన్న రవికి మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికారుల ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. బాధ్యతల నిర్వహ ణలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. తండ్రితో ఆస్తి సమస్యలు తలెత్తవచ్చు. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యల్లో చిక్కుకోవచ్చు. కుటుం బంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. విదేశీ ఉద్యోగావకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది.

సింహ రాశి

ద్వితీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి రవికి, అష్టమ స్థానంలో ఉన్న శనికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఉద్యోగ జీవితంలో అధికారులతో అపార్థాలు, వాదోపవాదాలు తలెత్తే అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. తండ్రితో అకారణ విభేదాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో వినియోగదారుల వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థానభ్రంశం కలిగే అవకాశం ఉంది. అప్రతిష్ఠపాలు కావడం జరుగు తుంది.

తులా రాశి

ఈ రాశికి ఆరవ స్థానంలోఉన్న శనితో వ్యయ స్థానంలో ఉన్న రవికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు కోర్టు దాకా వెళ్లే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కస్టమర్లతో వివాదాలు ఏర్పడతాయి. భారీగా ధన నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది.

మకర రాశి

రాశ్యధిపతి శనికి, అష్టమాధిపతి రవికి మధ్య సమసప్తకం ఏర్పడినందువల్ల అధికారులతో తప్పకుండా విభేదాలు, వాదాపవాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదు. తండ్రి నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. తండ్రి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచే కాక, కస్టమర్ల నుంచి కూడా సమస్యలు తలెత్తుతాయి. ధన నష్టం కలుగుతుంది.

మీన రాశి

ఈ రాశిలో ఉన్న శనికి, సప్తమ స్థానంలో ఉన్న రవికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ రాశివారు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. తండ్రితో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మీ పనితీరుతో వారు సంతృప్తి చెందకపోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఉద్యోగ, నివాస సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఊహించని విధంగా వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న గ్రహాల సంచార ప్రభావాలు, జ్యోతిష్య అంచనాలు సాధారణ జ్యోతిష్య విశ్వాసాలు, గ్రహాల స్థితిగతుల ఆధారంగా అందించబడినవి మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించరాదు. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులు తదితర అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు)