Reading Time: 2 minutes

చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం అక్రమం.. నోయల్ టాటా సంచలన కామెంట్స్!

Caption of Image.

టాటా గ్రూప్‌లో టాప్ లీడర్‌షిప్ వివాదం తారాస్థాయికి చేరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో 5 ఏళ్ల కాలానికి పొడిగిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సంచలన ఆరోపణలు చేశారు. చంద్రశేఖరన్ నియామకం పూర్తిగా “అక్రమం” అని.. చట్టవిరుద్ధంగా తన వీటో అధికారాన్ని భర్తీ చేశారని మండిపడ్డారు. ఈ పరిణామాలు టాటా గ్రూప్‌లో మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి.

4-1 తో గెలిచిన చంద్రశేఖరన్ వర్గం:
సెప్టెంబర్ 17న, గురువారం ముంబైలో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలని కోరుతూ జరిగిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 4-1 తేడాతో నిర్ణయం వెలువడింది. అయితే ఈ నిర్ణయాన్ని నోయెల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశం తర్వాత మాట్లాడుతూ.. “చంద్రశేఖరన్ నియామకాన్ని నేను వ్యతిరేకించాను. ఒక లీగల్ ఒపీనియన్ పేరుతో నా వీటో పవర్‌ను తప్పుదారి పట్టించి పక్కన పెట్టారు. ఈ బోర్డు నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధం, నేను దీనిపై నా అసమ్మతిని రికార్డు చేశాను” అని కుండబద్దలు కొట్టారు.

చంద్రశేఖరన్‌ను తప్పించేందుకు టాటా ట్రస్ట్స్ వ్యూహం?
బోర్డు స్థాయిలో వీటో అధికారాన్ని అధిగమించి చంద్రశేఖరన్ నియామకాన్ని ఆమోదించుకున్నప్పటికీ.. ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. డిసెంబర్ 31లోగా నిర్వహించాల్సిన టాటా సన్స్ AGMలో ఈ సంక్షోబ్దానికి అసలు వేదికగా మారనుంది. చంద్రశేఖరన్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేయనుండటంతో.. ఆయన పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం తప్పనిసరి. టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్.. ఏజీఎం వేదికగా చంద్రశేఖరన్‌ను డైరెక్టర్ పదవి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. డైరెక్టర్‌గా తొలగిస్తే ఆయన ఛైర్మన్‌గా కొనసాగడం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు.

ALSO READ : టాటా సన్స్ బోర్డ్ సంచలన నిర్ణయం

నాయకత్వ పోరు ఒకపక్క టాటా గ్రూప్ ను వేధిస్తుంటే.. RBI నుంచి టాటా సన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను వదులుకోవాలన్న టాటా సన్స్ అభ్యర్థనను రిజర్వు బ్యాంక్ తిరస్కరించింది. అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం కంపెనీ ఐపీఓ లేదా లిస్టింగ్ చేపట్టాల్సిన ఒత్తిడి నెలకొంది. ఈ సంక్లిష్టమైన రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి నాయకత్వ మార్పు జరగకూడదని బోర్డు భావించినప్పటికీ.. నోయెల్ టాటా మాత్రం చంద్రశేఖరన్ రీ అపాయింట్మెంట్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బోర్డు రూమ్ నుంచి వాటాదారుల సమావేశానికి చేరిన ఈ వివాదం మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే. ఈ పరిణామాల ప్రభావం శుక్రవారం టాటా గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ పై ఖచ్చితంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.