
Mahua Moitra: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలపై గుడ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కారుపై జనాలు గుడ్లతో దాడి చేశారు. ఆమె తన నియోజకవర్గం కృష్ణనగర్‌లో పార్టీ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో నిరసనకారులు ఆమె కారును అడ్డగించి, ‘గోబ్యాక్’ అంటూ గుడ్లను విసిరారు. నల్లజెండాలను చూపుతూ నిరసన తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులే తనపై దాడికి పాల్పడ్డారని మహువా ఆరోపించారు. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే తన వాహనంపై గుడ్లతో దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు.
ఈ దాడి తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో మహువా మోయిత్రా సెటైర్లు వేశారు. గతంలో ఆమె భద్రతకు సంబంధించిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. “జస్టిస్ దీపాంకర్ దత్తకు పెద్ద షౌట్‌అవుట్. నా నియోజకవర్గానికి సమావేశానికి వస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాను. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు వారి సహాయంతో నాపై గుడ్లు విసిరారు. మీరు ఇచ్చిన సలహా మేరకు స్వాతంత్ర్య సమరయోధులు బుల్లెట్లను ఎదుర్కొన్నట్టుగా నేను కూడా వారిని ఎదుర్కొన్నాను” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
సుప్రీంకోర్టులో ఏం జరిగింది.?
ఒక కేసులో పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మహువా మోయిత్రా కోరారు. తాను బయటకు వెళ్తే గుడ్ల దాడి జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగుతో కూడిన ధర్మాసనం ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గుడ్లు విసురుతారనే భయంతో వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదు, మన స్వాతంత్ర్య సమరయోధులు బుల్లెట్లను ఎదుర్కొన్నారని జస్టిస్ దత్త కామెంట్స్ చేశారు. దీని తర్వాత మహువా మోయిత్రా తరుఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యల్ని మహువా గుర్తుచేశారు.