
లోహాలను(ఇత్తడి, రాగి, వెండి) రేకులుగా మలచడం పెంబర్తి హస్తకళ ప్రత్యేకత. పెంబర్తి లోహ హస్తకళ ఖండాంతర ఖ్యాతి గడించింది. దేశంలోనే ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం పెంబర్తి. కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం ఉచ్ఛ దశకు చేరింది. కాకతీయుల అనంతరం ఈ పెంబర్తి హస్తకళ క్షీణదశకు చేరి అసఫ్జాహీల కాలంలో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకున్నది.
పెంబర్తి ఇత్తడి కళ తెలంగాణ వారసత్వ సంపదకు పర్యాయపదంగా నిలుస్తున్నది. పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ ముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్పైన అద్భుతంగా కళా ఖండాలు చెక్కే కళ జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో పుట్టింది.
ఈ కళ భారతీయుల కాలంలో ప్రజాదరణ పొంది రథాలు, ఆలయాలు అలంకరించేటప్పుడు ఉపయోగించేవారు. చారిత్రిక కట్టడమైన కాకతీయ ద్వారం ఈ పెంబర్తి కళారూపంలో చెక్కారు.
మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత ఆలయంలో పెంబర్తి హస్త కళాకృతులు కనిపిస్తాయి. ఈ పెంబర్తి లోహ హస్తకళకు 2010లో భౌగోళిక గుర్తింపు లభించింది.
అయిలాచారి
ఈయన పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయలోకి తీసుకెళ్లిన హస్తకళాకారుడు. ఈయన ఆధ్వర్యంలో విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ(1956) ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభ(1975)లకు ఇతని ఆధ్వర్యంలో లోగోలు, షీల్డ్లు తయారు చేశారు. తెలుగు సినిమా రంగం అందించే అత్యున్నత పురస్కారం అయిన నంది అవార్డు ప్రతిమను రూపొందించింది అయిలాచారినే .