Reading Time: 2 minutes
0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. అదేంటంటే?

Jasprit Bumrah World Record: భారత క్రికెట్ జట్టు (Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే పరుగులేమీ ఇవ్వకుండా అద్భుతమైన లైన్, లెంగ్త్, స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అఫ్గాన్ కెప్టెన్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) ఆరు బంతుల్లోనూ ఒక్క పరుగు కూడా తీయలేకపోయారు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను బుమ్రా మెయిడెన్‌గా ముగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

ఈ విలక్షణ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20లలో బుమ్రా వేసిన మొత్తం మెయిడెన్ ఓవర్ల సంఖ్య 13కు చేరింది. తద్వారా ఐసీసీ (International Cricket Council – ICC) పూర్తి స్థాయి సభ్య దేశాల జాబితాలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు నమోదు చేసిన బౌలర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో 12 మెయిడెన్లతో జింబాబ్వే (Zimbabwe) పేసర్ రిచర్డ్ నగరవ (Richard Ngarava) తో సమానంగా ఉన్న బుమ్రా, తాజా ప్రదర్శన ద్వారా ఆ రికార్డును అధిగమించి ఏకైక అగ్రస్థానానికి చేరుకున్నారు.

భారత బౌలింగ్ విభాగంలో మ్యాచ్ తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా వేసిన ఆటగాళ్ల జాబితాలోనూ బుమ్రా కొత్తగా చేరారు. ఈ విభాగంలో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఆరు సార్లు ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) రెండు సార్లు ఈ ఫీట్ సాధించగా, హర్భజన్ సింగ్ (Harbhajan Singh), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్ (Axar Patel), దీపక్ చాహర్ (Deepak Chahar), మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ఆశిష్ నెహ్రా (Ashish Nehra), ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), బరీందర్ స్రాన్ (Barinder Sran) ఒక్కోసారి తొలి ఓవర్ మెయిడెన్ వేశారు. తాజా ప్రదర్శనతో బుమ్రా కూడా ఈ ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..