Reading Time: < 1 minute
Cbi Case Against Us Missionary Group Over Rs 92 55 Crore Foreign Funds

CBI Case:  అమెరికాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ ది తిమోతీ ఇనిషియేటివ్‌‌తో పాటు దాని అధిపతి జొనాథన్ రాజన్, ఇండియా ఫైనాన్స్ హెడ్ అజిత్ వర్గీస్ మాథైతో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీకరణ, వినియోగంలో FCRA నిబంధనలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో ఈ సంస్థ సుమారుగా రూ. 92.55 కోట్ల విదేశీ నిధుల్ని తీసుకుందని, వాటిని మిషనరీ కార్యకలాపాలకు వాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ఈడీ నుంచి సమాచారం అందడంతోనే సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఏటీఎంల ద్వారా నిధుల విత్ డ్రా..

అమెరికాలోని ట్రూయిస్ట్ బ్యాంక్ జారీ చేసిన విదేశీ డెబిట్ కార్డులతో దేశంలోని వివిద ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదును విత్‌డ్రా చేసుకున్నట్లుగా తేలింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో దాదాపుగా 1000కి పైగా విదేశీ డెబిల్ కార్డులను పంపిణీ చేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కార్డుల్ని ఉపయోగించి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది. ఈ నిధులు భారత్‌కు ఎలా వచ్చాయి, ఎవరెవరు డబ్బుల్ని విత్ డ్రా చేసుకున్నారు, వీటిని ఏ కార్యక్రమాల కోసం వినియోగించారు, FCRA నిబంధనలు ఉల్లంఘించారా? అనేదానిపై సీబీఐ దర్యాప్తు చేయనుంది.

తిమోతీ ఇనిషియేటివ్ విదేశీ నిధులను శిక్షణ, మతప్రచార కార్యక్రమాలకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపించింది. పేద ప్రజల్ని ప్రభావితం చేసి వారిని వామపక్ష తీవ్రవాదం వైపు మళ్లించేందుకు కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు కూడా ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో చెప్పింది. ఈడీ చేసిన ఆరోపణల్ని ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు తేల్చాల్సి ఉంది. దర్యాప్తు సమయంలో సాక్ష్యాలను కూడా నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది. సోదాలు జరుగుతున్న సమయంలో సంస్థ సర్వర్లోలోని డేటాను రిమోట్‌గా యాక్సెస్ చేసి తొలగించినట్లు ఈడీ ఆరోపించింది.