
- సెన్సెక్స్ 778 పాయింట్లు పతనం
- 279 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- మరోసారి సూచీలకు చమురు సెగ
- యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపైనా టెన్షన్
ముంబై:భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. క్రూడాయిడ్ ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో సెన్సెక్స్ 777.94 పాయింట్లు నష్టపోయి74,003.82 వద్ద ముగిసింది. ఒకదశలో 1,400 వరకు కిందకు జారింది. నిఫ్టీ 279.50 పాయింట్లు కోల్పోయి 23,118.60 వద్ద ముగిసింది. ఇది గత ఐదు నెలల కనిష్ట స్థాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే మార్కెట్ క్యాప్ రూ.తొమ్మిది లక్షలు తగ్గి రూ.472 లక్షల కోట్లకు చేరింది.
బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎఫ్‌ఐఐలు గత శుక్రవారం రూ.930.90 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఏఐ ప్రభావం సాంప్రదాయ ఐటీ సేవలపై తక్కువగా ఉంటుందన్న అంచనాలతో ఐటీ సూచీలు పైకి కదిలాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్ 6 శాతం పడిపోయింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ పడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ 3.98 శాతం, ఇన్ఫోసిస్ 3.64 శాతం, టెక్ మహీంద్రా 2.31 శాతం, టీసీఎస్ 2.18 శాతం , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.27 శాతం లాభపడ్డాయి.
107 డాలర్లకు చేరిన క్రూడ్ ధర
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.89 శాతం పెరిగి 107.7 డాలర్లకు చేరుకుంది. ఇది మార్కెట్సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగడమే ఇందుకు కారణం. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ 2.50 శాతం, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ 2.41 శాతం పడిపోయాయి. బీఎస్‌ఈ క్యాపిటల్ గూడ్స్ 4.19 శాతం, రియల్టీ 3.93 శాతం పడిపోగా.. ఇండస్ట్రియల్స్ 3.57 శాతం, సర్వీసెస్ 3.03 శాతం , పవర్ 2.80 శాతం, ఇన్సూరెన్స్ 2.71 శాతం నష్టపోయాయి. ఐటీ 1.87 శాతం, ఫోకస్డ్ ఐటీ 1.49 శాతం పెరిగాయి. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
34 పైసలు నష్టపోయిన రూపాయి
విదేశీ మారకద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ 34 పైసలు బలహీనపడి 95.88 వద్ద ముగిసింది. చమురు దిగుమతిదారులు డాలర్ల కొనుగోళ్లను పెంచడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువయింది. డాలర్ ఇండెక్స్ 99.61 వద్ద ట్రేడయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా దేశీయ విదేశీ మారక నిల్వలు ఈ నాలుగో తేదీన ముగిసిన వారంలో 44.903 బిలియన్ డాలర్లు (రూ.4,30,715 కోట్లు) పెరిగి 785.706 బిలియన్ డాలర్లకు (రూ.75,37,128 కోట్లు) చేరుకున్నాయి.