
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా కొన్ని కీలక మినహాయింపులను కల్పించింది. ఇందులో భాగంగా టెలికాం, రైల్వే, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్ పేమెంట్లపై భారీ MDR చార్జీల నుంచి మినహాయింపును ప్రకటించింది.
ఈ కేటగిరీ చెల్లింపులపై ఒక ఫ్లాట్ ఫీజును నిర్ణయించారు. ఈ ప్రత్యేక కేటగిరీల్లో జరిగే లావాదేవీలపై పేమెంట్ ఎంత ఉన్నా సరే దానితో సంబంధం లేకుండా కేవలం రూ. 5 మాత్రమే ఫ్లాట్ ఫీజుగా వసూలు చేయనున్నారు. అలాగే అత్యధిక విలువతో కూడిన స్టాక్ మార్కెట్ లావాదేవీలకు మాత్రం MDRను అత్యంత కనిష్టంగా 0.02 శాతానికే పరిమితం చేశారు.
ఈ మినహాయింపుల వెనుక ప్రధాన ఉద్దేశ్యం మధ్యతరగతి, పేద వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రక్షణ కల్పించడమేనట. ఎందుకంటే టెలికాం రీచార్జ్‌లు, రైలు టికెట్ల బుకింగ్, వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వంటివి సామాన్యులు రోజువారీ జీవితంలో అత్యధికంగా ఉపయోగించే సేవలు కాబట్టి. ఒకవేళ వీటికి సాధారణ MDR వర్తిస్తే సామాన్యుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉండేది. ఫ్లాట్ రూ.5 ఫీజు వల్ల ఈ నిత్యావసర సేవలు అదనపు భారాలు లేకుండా సాగిపోతాయి.
అయితే ఈ మినహాయింపులు ఉన్నప్పటికీ వ్యాపారులు ఈ మొత్తాన్ని నేరుగా కస్టమర్లపైకి నెట్టివేయకుండా NPCI కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఏ రంగంలోనైనా సరే కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని అక్వైరర్ బ్యాంకులను అంటే వ్యాపారి బిజినెస్ అకౌంట్ ఉన్న బ్యాంకులకు స్పష్టంగా ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వం డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిస్తూనే.. మరోవైపు కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చింది.