Reading Time: < 1 minute
Nizamabad Haribabu Murder Vaishnavi Case Accused

Nizamabad Murder: నిజామాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపిన హత్య ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కేంద్రమైన రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబు అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. గత మార్చి నెలలో తీవ్ర దుమారం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ దారుణం జరగడం కలకలం రేపింది.

ప్రేమ పెళ్లి.. ఎనిమిది నెలలకే భార్య హత్య

జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వారిని ఎదిరించి మాదాపూర్‌లోని అత్తవారింట్లోనే కాపురం పెట్టాడు. అయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం ఎనిమిది నెలలకే మనస్పర్థలు రావడంతో భార్య వైష్ణవిని హరిబాబు దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన హరిబాబు, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.

కొబ్బరికాయలు కోసే కత్తితో దారుణ దాడి

రాజారాజేంద్ర చౌరస్తా వద్ద హరిబాబు వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆయనను అడ్డుకున్నారు. వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నడిరోడ్డుపైనే హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావమైన హరిబాబు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు.

పాత కక్షలే కారణమా?.. దర్యాప్తు ముమ్మరం

బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబును వైష్ణవి హత్యకు ప్రతికారంగానే లేదా పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్య చేసి పరారైన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.