Reading Time: < 1 minute
Team India: వైభవ్‌ను డ్రాప్ చేస్తే.. శ్రీకాంత్ భార్యకు ఎందుకంత కోపం? నన్ను నిలదీసిందన్న  మాజీ చీఫ్ సెలెక్టర్

Team India: భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న ఎంపిక విధానంపై మాజీ క్రికెటర్, చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌లను జట్టులో పక్కన పెడుతున్న తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నిన్న వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో లేకపోవడంతో మేము సినిమా చూడటం మొదలుపెట్టాం. చివరి సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా నిలిచిన ఆటగాడిని ఎలా పక్కన పెడతారంటూ నా భార్య నన్ను గట్టిగా నిలదీసింది. మా ఆవిడ కూడా ఇలాంటి నిర్ణయం సరైనదేనా అంటూ ప్రశ్నించిందని శ్రీకాంత్ వెల్లడించారు. వైభవ్‌ను సరిగ్గా ట్రీట్ చేయడం లేదని, ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ, టీ20లు, ఇండియా-ఏ, ఐపీఎల్ వంటి అన్ని స్థాయిలలోనూ నిలకడగా రాణిస్తున్నాడని శ్రీకాంత్ గుర్తుచేశారు. ఒక మ్యాచ్‌లో విఫలమైతే తదుపరి మ్యాచ్‌లో డ్రాప్ అవుతామనే భయం ఆటగాళ్లలో కలుగుతుంది. ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల మనసుల్లో అనుమానాలు రేకెత్తిస్తోందని ఆయన మండిపడ్డారు.

మరోవైపు సంజూ శాంసన్ విషయంలోనూ టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరును శ్రీకాంత్ తప్పుబట్టారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన సంజూ శాంసన్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతూ జట్టులోకి రావడం, వెళ్లడం జరుగుతోందని అన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సంజూ స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20లో మళ్లీ సంజూను తీసుకువచ్చి కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంజూకి లేదా వైభవ్‌కు నిలకడగా అవకాశాలు ఇవ్వాలని, ఇలా చెరో రెండు మ్యాచ్‌లు ఇచ్చి పక్కన పెట్టడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..