Reading Time: 2 minutes

14 వందల పాయింట్లు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లను నిండా ముంచిన కారణాలు ఏంటంటే?

Caption of Image.

సెప్టెంబర్ 15న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఉదయం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు.. కొన్ని నిమిషాల్లోనే కోలుకోలేని విధంగా పతనమయ్యాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్లు నష్టపోవడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 

దీంతో సెన్సెక్స్ సూచీ 778 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 812 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1319 పాయింట్ల భారీ నష్టంతో తమ ప్రయాణాన్ని మంగళవారం రోజున ముగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కేవలం 1,070 షేర్లు మాత్రమే లాభపడగా, దాదాపు 3,054 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 134 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. అయితే మార్కెట్ల భారీ పతనానికి దారితీసిన కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్ల క్రాష్‌కి దారితీసిన ప్రధానాంశాలు:

1. చుక్కలను తాకుతున్న క్రూడ్:
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్ల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు పైప్‌లైన్‌లపై దాడులు జరగడం, సరఫరా నిలిచిపోతుందనే భయాలు పెరిగాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ దిగుమతి దేశమైన భారత్‌కు ఈ ధరల పెరుగుదల ఆందోళనకరమైన అంశమనే చెప్పుకోవాలి. ఇది మన కరెంట్ అకౌంట్ లోటును పెంచడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా భారీగా పెంచేస్తుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. 

2. రికార్డు స్థాయిలో అమెరికా బాండ్ ఈల్డ్స్:
అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అక్టోబర్ 2023 తర్వాత తొలిసారిగా మళ్లీ 5% మైలురాయిని తాకాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ ఇంతలా పెరగడం వల్ల గ్లోబల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకుని సురక్షిత అమెరికా అసెట్స్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇది ఎమర్జింగ్ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ పై కూడా తీవ్ర ఒత్తిడిని తెచ్చింది.

ALSO READ : నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండా మానేస్తే కంపెనీలు బ్లాక్ మెయిల్ చేయవచ్చా?

3. బలహీనమైన టెక్నికల్స్:
సాంకేతికంగా నిఫ్టీ సూచీ కీలకమైన 23,500 – 23,600 మార్కులను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ మరింత బలపడాలంటే కచ్చితంగా 23,600 స్థాయిని దాటాలని నిపుణులు భావించినప్పటికీ.. అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీ గత వారపు కనిష్ట స్థాయిల దిశగా పరుగెత్తింది. లోయర్ హైస్, లోయర్ లోస్ ప్యాటర్న్ ఏర్పడటం మార్కెట్‌లో బేరిష్ ట్రెండ్‌ను స్పష్టం చేస్తోంది.

మార్కెట్లు పతనమైనప్పటికీ ఐటీ రంగానికి చెందిన షేర్లు మాత్రం కొంత ఊరటనిచ్చాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ దాదాపు 5%, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 3% నుంచి 4% వరకు లాభపడి మార్కెట్ పూర్తిగా పడిపోకుండా కాపాడాయి. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు నిఫ్టీని బలంగా కిందికి లాగాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలు 2% నుండి 3.5% వరకు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం ఎమ్‌డీ, సీఈఓ పేర్లను ఆర్‌బీఐకి సమర్పించడంతో స్వల్ప లాభంతో ట్రేడ్ ముగించాయి. 
 

©️ VIL Media Pvt Ltd.