Reading Time: 2 minutes

మీ ఫోన్ నుంచి రూ.10 వేలు పంపితే..40 రూపాయలు ఛార్జీ పడుతుందా..?

Caption of Image.
  • UPI పేమెంట్లపై కొత్త ఛార్జీలు.. సామాన్యుడిపై భారం ఎంత?
  • పెంచిన ఛార్జీలు మర్చంట్లు చెల్లిస్తారంటున్న కేంద్ర ప్రభుత్వం
  • పేమెంట్ సంస్థలు, బ్యాంకుల విధానాలపై ఆధారపడి కస్టమర్ పై కొత్త ఛార్జీలు 
  • కొత్త ఛార్జీలతో నేరుగా కస్టమర్ పై భారం పడుతుందని ప్రతిపక్షాల ఆందోళన

UPI పేమెంట్లపై కొత్త ఛార్జీలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రూ.2వేలకు పైబడి  చెల్లింపులపై100కి 40 పైసలు వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలను మర్చంట్లనుంచి వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా .. కస్టమర్ నుంచి వసూలు చేయాలా వద్దా అన్నది సంబంధిత చెల్లింపుల సంస్థలు, బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి యూపీఐ పేమెంట్లపై  కొత్త ఛార్జీల భారం నేరుగా ప్రజలపై పడే అవకాశం ఉందని  పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

మంగళవారం సెప్టెంబర్ 15న సమావేశమైన యూపీఐ స్టీరింగ్ కమిటీ.. రూ. 2వేలకు పైబడిన లావాదేవీలకు యూపీఐ ఎండీఆర్‌ను 40 బీపీఎస్‌గా నిర్ణయించిన క్రమంలో UPI యాప్‌ల ద్వారా పెద్ద మొత్తాల్లో చెల్లింపులు చేసే ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ MDR సాధారణంగా మర్చంట్‌ నుంచి వసూలు చేసే కమీషన్ కాగా, కస్టమర్ నుంచి నేరుగా వసూలు చేయాలా లేదా అన్నది సంబంధిత చెల్లింపు సంస్థలు, బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది.

40 బీపీఎస్ అంటే ప్రతి రూ.100కి 40 పైసలు. ఉదాహరణకు రూ.2వేల500 చెల్లింపుపై MDR రూ.10, రూ.5వేలపై రూ.20, రూ.10వేలపైన రూ.40, రూ.25వేలపై రూ.100 అవుతుంది. ఒకవేళ ఈ ఛార్జీని పూర్తిగా వినియోగదారుడిపైనే బదిలీ చేస్తే, పెద్ద మొత్తాల డిజిటల్ చెల్లింపులు చేసే వారికి ఖర్చు పెరుగుతుంది.

►ALSO READ | మనుషుల మాటలను రికార్డ్ చేస్తున్న LG స్మార్ట్ టీవీలు? వివాదంపై కంపెనీ క్లారిటీ!

ఇదిలా ఉంటే.. రూ.2వేలవరకు UPI చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రోజువారీ చిన్న మొత్తాల చెల్లింపులు చేసే ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగానే ఉంటుందని అంటోంది. కానీ రూ.2వేలకు పైబడిన షాపింగ్, బిల్లులు, ఫీజులు, సేవల చెల్లింపుల సమయంలో అదనపు ఛార్జీ విధిస్తే వినియోగదారులపై పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి UPI యాప్‌లు బ్యాంకులతో కలిసి సేవలు అందిస్తున్నాయి. సుమారు 40 బేసిస్ పాయింట్ల MDR తో ఈ ఎకోసిస్టమ్ కు ఏటా రూ. 16వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. MDR ద్వారా వచ్చే ఆదాయం NPCI, బ్యాంకులు, PSPలు, పేమెంట్ అగ్రిగేటర్లకు పంపిణీ అవుతుంది. ఈ క్రమంలో 40 బీపీఎస్ MDRను వ్యాపారులు భరిస్తారా? లేక చివరికి వినియోగదారులపై ఛార్జీ రూపంలో పడుతుందా? అనేది UPI వినియోగదారులపై ప్రభావాన్ని నిర్ణయించనుంది.

©️ VIL Media Pvt Ltd.