Reading Time: 2 minutes
Pawan Kalyan Rapid Road Sanctions Rural Development Andhra Pradesh

AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రజాపాలనతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో నిధుల మంజూరు, పనుల ఆమోదానికి నెలల తరబడి సమయం పడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల సమస్యల తీవ్రతను బట్టి రోజుల వ్యవధిలోనే కాదు, ఏకంగా గంటల వ్యవధిలోనే రోడ్లను మంజూరు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేసిన రోడ్లతో పాటు, పలు సందర్భాల్లో ప్రజలు నేరుగా తన దృష్టికి తెచ్చిన కోరికల ఆధారంగా అప్పటికప్పుడు రోడ్లు మంజూరు చేసిన ఘనత ఆయనది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లే రోడ్డు సరిగా లేదని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. అలాగే ప్రపంచ కప్ గెలిచిన అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ టి.సి. దీపిక తన సన్మాన కార్యక్రమంలో తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరిన వెంటనే స్పందించారు. ఈ క్రమంలో ఆమె డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఇంటికి చేరే లోపే రోడ్డు మంజూరు కావడం పవన్ కళ్యాణ్ వేగానికి నిదర్శనం. అంతేకాకుండా, కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అల్లూరి జిల్లా లబ్బర్తి పంచాయతీకి చెందిన లాకే బాబురావు తన గ్రామానికి రోడ్డు కావాలని వేదికపైనే పవన్ కళ్యాణ్‌ను కోరగా, ఆయన వేదిక దిగే లోపే ఆ రోడ్డును మంజూరు చేయడం గమనార్హం.

ఈ వేగవంతమైన నిర్ణయాల ఫలితంగా ఇప్పటివరకు రెండు దశల్లో రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి చేపట్టగా, దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఎన్నో గిరి శిఖర గ్రామాల్లో సంక్లిష్ట పరిస్థితులు, భౌగోళిక సవాళ్లను ఎదుర్కొని మరీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ఆయా ప్రాంతాలకు రవాణా వెసులుబాటు కల్పించారు. కేవలం రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మౌలిక వసతుల కల్పనపై ఆయన దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల పంట కుంటలు నిర్మించగా, ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే సుమారు 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరగడం విశేషం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. పాడి రైతుల సంక్షేమం కోసం, పశువులకు నీడ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 38,000కి పైగా మినీ గోకులాలు నిర్మించడంతో పాటు, వేసవి తీవ్రత నుంచి మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు 15 వేల నీటి తొట్టెలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 54 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించారు. గ్రామాల్లో మౌలిక వసతుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల అపార విజయంతో ఇప్పుడు పల్లెపండుగ 3.0 కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.