
ఉచిత పథకాలపై అడ్డూ అదుపూ లేకుండా భారీగా పెడుతున్న ఖర్చు…తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని కుదేలు చేస్తోంది. ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతోంది. అప్పులు చేసి ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా…పాలకులు మారుతున్నా…అప్పులు కుప్ప మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రెండు ప్రభుత్వాలు…అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నాయి. ఈ అప్పులు ఇలాగే కంటిన్యూ అయితే…ఫ్యూచర్‌లో ప్రభుత్వాలు నడపడానికి ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ రాష్ట్రానికైనా ఆర్థిక వ్యవస్థే కీలకం. ఓ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితినే కాదు.. భవిష్యత్తును అంచనా వేయటానికి కూడా ఆర్థిక చక్రమే కీలక ప్రాతిపదిక. ఏటా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనిపిస్తుందా.. లేదా అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. తెలంగాణలో ప్రస్తుత సర్కారు ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. అలాగే ఏపీలోనూ కూటమి సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఏ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఓవరాల్‌గా ఏ రాష్ట్రం ఆర్థిక స్థితి కూడా సంతృప్తికరంగా లేదనేది బహిరంగ రహస్యమే. ఏపీకి అప్పులు ఎక్కువగా ఉన్నా.. తెలంగాణకు ఆదాయం తగ్గకపోయినా.. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ కారణంగానే రెండు ప్రభుత్వాలూ ఆర్థిక వనరుల సమీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. అటు అప్పులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్నా.. కొత్తగా అప్పులు చేయక తప్పని స్థితి ఉందని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కొన్నిసార్లు బహిరంగ సభల్లో కూడా ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఆర్థిక పరిమితులున్నాయి.. వస్తున్న ఆదాయాన్ని బట్టి ఖర్చును నియంత్రించక తప్పదని తేల్చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వాలు అప్పులతోనే నడుస్తున్నాయి. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. రాష్ట్రం విడిపోయిన తర్వాత…ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి…అటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డిలు…అప్పులతోనే ప్రభుత్వాలను నడిపించారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆ అప్పులను మరింత పెంచుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా…కొత్త స్కీంలు ప్రకటించాలన్నా…ప్రభుత్వాలు అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పు చేస్తే అభివృద్ధి సాధ్యమని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే అక్షరాలా లక్షల కోట్లలో ఉన్నాయి. ప్రతీ ఏడాది బడ్జెట్ అంకెలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అభివృద్ధి మాత్రం చెప్పిన రేంజ్‌లో కనపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు, పథకాలతో…ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఆర్థికభారం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆదాయం మాత్రం అంతంగా మాత్రంగానే ఉంది. ఫ్యూచర్‌లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ప్రభుత్వాలు నడవడానికి నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల బడ్జెట్ పరిమాణానికి, ఖజానా పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 లక్షల 32 వేల 205 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రకటించింది. అయితే ఇందులో లక్ష కోట్ల రూపాయల లోటును కూడా చూపించారు. ప్రతి వారం ఏపీ సర్కారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు తెస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంపై 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు న్నాయనే సమాచారం బయటకొస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల వంటి ముఖ్యమైన రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. కాంగ్రెస్ మార్క్ పథకాలైనా…రైతు భరోసా, చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకాలకు భారీగా నిధులు కేటాయించింది.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. గతంలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి 60 ఏళ్లకు పైగా పాలించినా రాష్ట్ర అప్పులు 70 వేల కోట్లుగా ఉండేవని, గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో అప్పులను భారీగా పెంచిందని ఆరోపించారు. 70 వేల కోట్ల అప్పును 8.11 లక్షల కోట్లకు తీసుకెళ్లిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రతి నెలా భారీ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కారణంగా ఏడాదికి సుమారు 90 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడంతోనే రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 2019 వరకు తలసరి అప్పు 74,790 ఉంటే…2024లో అది 1.44 లక్షలకు చేరిందని గుర్తు చేశారు. అప్పులు తీర్చకుంటే రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెడతారని, ఆ తర్వాత ఏపీకి అప్పు పుట్టే పరిస్థితి ఉండదని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి జరుగుతుందని తద్వారా సంక్షేమం చేసి మళ్లీ సంపద సృష్టిస్తామన్నారు. రాష్ట్ర ఆదాయం 17.1% నుంచి 9.8 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. కానీ అప్పులు మాత్రం 16.5% పెరిగాయని చెప్పారు.
పదేళ్లలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ అకౌంట్ బకాయిలు సగటున 106% పెరిగితే…తెలంగాణ లయబిలిటీ మాత్రం 826% పెరిగింది. ఇది దేశంలో అత్యధికం. అన్ని రాష్ట్రాల ఉమ్మడి అప్పులు 190% పెరిగితే…తెలంగాణ అప్పులు 357% పెరిగాయి. ఇది దేశంలో అత్యధికం. 2015-16 నుంచి 2024-25 మధ్యకాలంలో దేశంలోని అన్నిరాష్ట్రాల అంతర్గత అప్పు 205% పెరగ్గా…తెలంగాణ అప్పు మాత్రం 352% పెరిగింది. అత్యధికంగా అంతర్గత అప్పు పెరిగిన రాష్ట్రాల్లో అస్సాం 415%, అరుణాచల్‌ప్రదేశ్ 389%, ఛత్తీస్‌గఢ్ 361% తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. 2024-25 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 27.27 శాతానికి చేరాయి. రెవన్యూలోటు -0.57%, ఆర్థిక లోటు -2.98% మేర నమోదైంది. 2024-25లో కేంద్ర పన్నుల్లో వాటాకు ముందు 27,376 కోట్లు, వాటా తర్వాత 47,063 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనావేసింది. వాస్తవంగా 9,420 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది.
ప్రభుత్వరంగ సంస్థలు, ఎస్‌పీవీలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు జీఎస్‌డీపీలో 2,41,528 కోట్లు 14.72% మేర ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. జీడీపీలో 10శాతానికి మించి గ్యారంటీలు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. 2025 మార్చి 31 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ 16,40,901 కోట్లు ఉండగా, పబ్లిక్ డెట్ 3,91,881 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16 రాష్ట్రాలు కలిపి ఇచ్చి పుచ్చుకునే, ఓవర్‌డ్రాఫ్ట్ కింద 6.87 లక్షల కోట్లు ఉపయోగించుకోగా అందులో 1,29,376 కోట్లు వాడుకొని తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2015 -16 నుంచి 2024-25 మధ్య పదేళ్ల కాలంలో ప్రతి సంవత్సరమూ వేస్ అండ్ మీన్స్, ఉపయోగించుకున్న 9 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది.